ప్రతి 100 మంది వద్దా తెలంగాణలో 110, ఏపీలో 86 సెల్ ఫోన్లు
personBuruju Editor date_range2022-10-03
హోటల్ నుంచి ఆహార పదార్ధాలను తెప్పించుకోవటం , బ్యాంకు పనులు, ఇంట్లో నిరుపయోగ వస్తువులను అమ్మేయటం వంటి ఎన్నెన్నో పనులకు ఇప్పుడు సెల్ ఫోనే ఆధారం. అది ఒక్క నిముషం కనిపించకపోయినా, పనిచేయకపోయినా మనస్సు కాకావికలమవుతుంది
బురుజు.కాం Buruju.com : తెలంగాణ జనాభా 3 కోట్ల 50 లక్షలు. ఇక్కడ ప్రస్తుతం వినియోగిస్తున్న సెల్ ఫోన్ల సంఖ్య అక్షరాల 4 కోట్ల 22 లక్షలు . అంటే.. చంటి పిల్లలతో సహా మొత్తం జనాభాతో పోలిస్తే వారి సంఖ్య కంటే 72 లక్షల పోన్ కనెక్షన్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో సగటున ప్రతి వంద మంది వద్ద 110 సెల్ ఫోన్లు ఉన్నట్టుగా తేలుతోంది. వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితిని చూస్తుంటే.. త్వరలో రాజకీయ పార్టీలు నెలవారీ కొంత మొత్తాన్ని సెల్ ఫోను ఛార్జీల కోసం ఇస్తామనే హామీలను గుప్పించవచ్చనిపిస్తోంది.
సెల్ ఫోను అన్ని వర్గాల వారికి తప్పనిసరి సాధనమయ్యింది
సెల్ ఫోను cell phone ఇప్పుడు నిత్యావసర వస్తువుగా మారిపోయింది. తక్కువ మొత్తంతో రీ ఛార్జి చేసుకొనే సౌకర్యం ఉండటంతో దినసరి కూలీలూ సెల్ ఫోన్లను వినియోగించుకోగలుగుతున్నారు. టెలికం నియంత్రణ సంస్థ 2021, జూలై-సెప్టెంబరు మధ్య సేకరించిన గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి. వీటి ప్రకారం.. ప్రతి వంద మంది వద్దా 177 సెల్ ఫోను కనెక్షన్లతో గోవా ప్రధమ స్థానంలో నిలబడగా.. కేవలం 51 సెల్ కనెక్షన్లతో బీహార్ చివరి స్థానంలో ఉంది. తెలంగాణది Telangana ఏడో స్థానం. ఇక్కడ గ్రామాల్లో 1.80 కోట్లు, పట్టణాల్లో 2.42 కోట్లు సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయి.
కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసుల కారణంగా చిన్న పిల్లలకూ సెల్ ఫోను చేరువయ్యింది
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ప్రతి వంద మందికి 86 సెల్ కనెక్షన్లతో దేశంలో 13వ స్థానంలో నిలిచింది. మిగతా మరికొన్ని రాష్ట్రాలను తీసుకొంటే.. ప్రతి వంద మందికి కేరళలో 123, పంజాబులో 122, తమిళనాడులో 102, మహారాష్ట్రలో 101, కర్ణాటకలో 100, గుజరాత్ లో 95 సెల్ ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి.