బురుజు.కామ్ : Buruju.com : Hyderabad: సినిమాలను రెండు భాగాలుగా తీయటం ఇటీవల కాలంలో ఎక్కువయ్యింది. దీంతో మొదటి భాగంలో చివరిలోనే దర్శకుడు రెండో భాగం సంకేతాన్ని కూడా ఇస్తున్నారు. ఇటువంటి సంకేతాన్ని చాలా జాగ్రత్తగా ఇవ్వకపోతే మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని ‘జటాధర Jatadhara’ movie సినిమా చెబుతోంది. దీనిలో నరబలులు కోరే ధన పిశాచిని హీరో అనేక కష్టాలు పడి నిరోధించంతో హమ్మయ్య అనుకొంటున్న ప్రేక్షకుడిని వెంటనే రెండో పార్టు కోసం ఆ ధన పిశాచి మళ్లీ విజృంభిస్తున్నట్టుగా చూపించి కంగు తినిపించారు. ఇటువంటి ముగింపుతో పాటుగా పసలేని కథ కారణంగా మొదటి పార్టు పరాజయం పాలయ్యింది. అసలు మూఢ నమ్మకాలను , నర బలులను ప్రోత్సహించే ఇటువంటి సినిమాలు పరాజయం అయితేనే అటువంటివి మళ్లీమళ్లీ రాకుండా ఉంటాయి. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగు అవుతోంది.
చేతబడులు వంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒకప్పుడు ప్రభుత్వాలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రచారాలు నిర్వహించేవి. క్రమేణా అవి నిలిచిపోయాయి. మరో వైపు.. మూఢనమ్మకాలు, దెయ్యాలతో మిళితమైన సినిమాలు అసంఖ్యాంగా వచ్చిపడుతున్నాయి. ఇటువంటి కోవకు చెందిందే ‘ జటాధర’ Jatadhara . భూమిలో నిక్షిప్తమై ఉన్న గుప్త నిధులను వెలికి తీయాలంటే అక్కడ కాపలాగా ఉండే ధన పిశాచిని నరబలులతో ప్రసన్నం చేసుకోవాల్సివుంటుందని దీనిలో చూపించారు. మధ్యలో సైన్సు, అంనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నిధులకు నాగబంధం వంటి అంశాలను జొప్పించి ఇదొక అద్భుత పరిశోధన చిత్రంగా నమ్మించేందుకు దర్శకుడు అభిషేక్ జైశ్వాల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హీరో సుధీర్ బాబు Sudhirbabu ఇటువంటి సినిమాల జోలికి వెళ్లకుండా ఉంటేనే ఆయన భవిష్యత్తు బాగుంటుంది.
ఇంతకు ముందటి సినిమాల్లో నర బలులను కోరుకొనే పిశాచులు భయంకరమైన రూపాలతో కనిపించేవి. జటాధరలో మాత్రం హిందీ నటి సోనాక్షి సిన్హాను Sonakshi Sinha అందాల ధన పిశాచిగా చూపిస్తూ ఆమె మళ్లీమళ్లీ కనపడితే బాగుండును అనే రీతిలో చిత్రీకరించారు. ఆమె ఒంటినిండా కేజీల కొద్దీ బరువు ఉండే బంగారు అభరణాలను ధరించి, దగదగా మెరుస్తూ కొన్ని సందర్భాల్లో అనేక చేతులతో కాళికాదేవా? అనిపించేలా ఉంటుంది. ఆమె చుట్టూ శివలింగాలను పెట్టి హీరో నడిపిన కథంతా చివరిలో ఇచ్చిన ఒక హింట్ కారణంగా నిర్వీర్యమై పోయింది.
ధన పిశాచి చుట్టూ దారాలు మాదిరిగా ఉన్న బంధనాన్ని మూడేళ్ల తర్వాత ఒకరు కాల్చటంతో తగలిపడి పోయి ధన పిశాచైన సోనాక్షి సిన్హా మళ్లీ మేల్కొన్నట్టుగా సినిమాను ముగించారు. అంటే అంతవరకు హీరో చేసిన కృషంతా వృధా అయినట్టే కదా? రెండో పార్టును తీయాలనే ఆతృతతో ఇలా చూపించటం వల్ల మొదటి పార్టు ఎటువంటి థ్రిల్ పంచనదిగా మారిపోయింది.