చనిపోయిన విద్యార్ధి గదిలో ఫొటోలను తీస్తున్న చిత్రం
బురుజు.కామ్ Buruju.com :Hyderabad: కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలను పొందిన వ్యక్తి అయినప్పటికీ అతను చనిపోయిన తర్వాత గదులను శుభ్రంగా కడుక్కొని అతని వస్తువులను చాలా వరకు ఇతరులకు ఇచ్చేయటమో లేదా బయట పడేయటమో భారత్ లో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆనవాయితి. అమెరికాలోని కొన్ని కుటుంబాల వారు మాత్రం చనిపోయిన తమ పిల్లల గదులను వారు వాడిన వస్తువులతో అలంకరించి వారి జ్ఞాపకార్ధం వాటిని ఏళ్లతరబడి అలాగే అట్టిపెడతారనే విషయం తాజాగా ఒక డాక్యుమెంటరీ ద్వారా వెలుగులోకి వచ్చింది. అక్కడి దుండగులు ఒక్కోసారి పాఠశాలల్లో సైతం విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పిల్లల్ని పొట్టన పెట్టుకొంటుంటారు. అలా చనిపోయిన పిల్లల గదులను జర్నలిస్టు Steve Hartman, ఫొటోగ్రాఫరు Lou Bopp సందర్శించి వాటిలోని ప్రతి వస్తువుకు ఫొటోలను తీసి అల్బమ్ లను తయారు చేశారు. వారి కృషిని All The Empty Rooms పేరుతో డాక్యుమెంటరీగా రూపొందింది. ప్రస్తుతం ఇది Netflix లో స్ట్రీమింగు అవుతోంది. డాక్యుమెంటరీని చూసేవారికి కళ్లు చెమ్మగిల్లుతాయి. ఇది 2025 టొరొంటో అంతర్జాతీయ చలనచిత్రోవత్సంలో ప్రదర్శితమయ్యి అస్కార్ అవార్డుకు సైతం నామినేట్ అయ్యింది.
ఇదొక గుర్తు
అమెరికాలోని గన్ సంస్కృతి చాలా సార్లు వెర్రి తలలు వేస్తోంది. దుండగులు అక్కడి స్కూళ్లలోకి సైతం చొరబడి పిల్లలపై గుళ్ళ వర్షం కురిపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అలా చనిపోయినవారిలోని కొందరి తల్లితండ్రులు వారి పడక గదులను అసలు ముట్టుకోకుండా ఏళ్ల తరబడి అలాడే ఉంచేయటం ప్రముఖ CBS News Channel రిపోర్టర్ Steve Harman , ఫొటో గ్రాఫరు Lou Bopp లను ఆలోచింపజేశాయి. అటువంటి పిల్లల గదులను సందర్శించి అక్కడి ప్రతి వస్తువును అత్యంత అపురూపమైనదిగా పరగణించి వాటన్నింటికీ ఫొటోలను తీశారు. వాటితో తయారు చేసిన ఆల్బమ్ లు పలువురిని విశేషంగా ఆకట్టుకొన్నాయి. వారు గదుల్లోకి ప్రవేశించి ఆయా పిల్లల వస్తువులకు ఫొటోలను తీసిన విధానం, ఆ సమయంలో మృతుల కుటుంబ సభ్యుల భావోద్యేగాలతో All The Empty Rooms డాక్యుమెంటరీ తయారయ్యింది.
కొత్త ఒరవడితో రూపొందిన ఈ 33 నిముషాల విషాద అంశాల డాక్యుమెంటరీ పలువురి ప్రశంసలు అందుకొంటోంది. ఇంటి నుంచి మృత దేహం తరలి వెళ్లిపోగానే ఇళ్లంతా పసుపు నీళ్లను జల్లుకొని మైలు పాటించే ఆచారం గల తెలుగు కుటుంబాల వారికి ‘ఆల్ ది రూమ్స్ ఎమ్టీ’ డాక్యుమెంటరీ తప్పకుండా ఆలోచనలను రేకిత్తిస్తుంది. అన్ని ఇళ్లల్లోను మృతుల గదులను ఆలాగే అట్టిపెట్టటం సాధ్యం కాకపోవచ్చు. కనీసం వారు ఉపయోగించిన వస్తువుల్లోని నోట్ పుస్తకాలు, కళ్లజోడు, గొడుగు వంటి కొన్నింటినైనా భద్రపర్చగలిగితే అవి వారిని ఎప్పటికి జ్ఞప్తికి తెస్తుంటాయి.