భక్షక్ సినిమాలో జర్నలిస్టు పాత్రధారి భూమి పెడ్నేకర్
బురుజు.కాం Buruju.com : Hyderabad: ఓటీటీ వేదికపై ప్రదర్శించే తెలుగు చిత్రాల్లో బూతు మాటలు ఉండి తీరాలని నిర్మాతలు, దర్శకులు గట్టిగా నమ్ముతున్నారో ఏమో కాని మంచి సినిమాల్లో సైతం ఇటువంటి జాఢ్యం తప్పటంలేదు. అనాధ ఆశ్రమంలోని బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఒక మహిళా జర్నలిస్టు ధైర్యంగా బయట పెట్టటం ఇతివృత్తంగా గల ‘భక్షక్’ BHAKSHAK సినిమాలో పలు బూతు మాటలు వినిపిస్తుంటాయి. ‘వెర్రి పూ.. ’ అనే మాటను పలు పాత్రలు అవలీలగా అనేస్తుంటాయి. ‘ఇంకా గుద్ద పగల దెం.. ’ ‘ముడ్డులో రాడ్డు’ వంటివీ ఉన్నాయి. సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగు అవుతోంది. డబ్బింగులో బూతు మాటలు లేకుండా ఉంటే సినిమాను కుటుంబ సభ్యులంతా కలిసి చూడటానికి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు.
రాజకీయ పలుకుబడి గలవారు నిర్వహించే పాట్నా సమీప మునువర పూర్ అనాధ ఆశ్రమంలో ఒళ్లు గగుర్పాటు కలిగించే ఎన్నెన్నో దారుణాలు జరుగుతుంటాయి. బాలికలు, యువతులను తీవ్రంగా హింసించి అత్యాచారాలు చేస్తుంటారు. దారికి రాని వారిని హతమారుస్తుంటారు. మహిళా జర్నలిస్టు వైశాలి ( భూమి పెడ్నేకర్) ఎంతో కష్టపడి అక్కడి విషయాలను తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా బహిర్గతం చేస్తుంది. చివరికి ఒక మహిళా ఎస్సీ అండగా నిలబడటంతో నేరస్థులు అరెస్టవుతారు. భక్షక్ Bhakshak సినిమాను దర్శకుడు పులికిత్.. హిందీలో ఓటీటీ కోసమే నిర్మించాడు. సినిమా ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తుంది. తెలుగు డబ్బింగులో బూతు మాటలు Vulgar words లేకుండా జాగ్రత్తపడొంటే సినిమా ఇంకా బాగుండేది.
సినిమాలో హీరోయిన్ మొదలు కొని అంతా ‘పీఐఎల్’ అని అంటుంటారు. దీనికి ‘పిల్’ (ప్రజా ప్రయోజన వాజ్యం) అని తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రచారంలో ఉన్నందున అదే మాటను వాడుంటే అందరికీ బాగా అర్ధమయ్యి ఉండేది. బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ ‘సోషల్ ఆడిట్ రిపోర్టు’ బహిర్గతం చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవటం సినిమాలోని కీలకాంశం. ఆ రిపోర్టును ఒకరి నుంచి జర్నలిస్టు వైశాలి రూ.50వేలకు కొనుగోలు చేస్తుంది. సోషల్ ఆడిట్ అంటే.. ప్రభుత్వమే ప్రభుత్వేతర సంస్థతో తనిఖీ చేయించుకొని తెప్పించుకొనే నివేదిక. నివేదికలో అత్యాచారాలు వంటి తీవ్రమైన అంశాలు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా సరే తప్పకుండా స్పందిస్తుంది. అయినా పోలీసులతో సహా ఏ ఒక్కరినీ అనాధ ఆశ్రమంలోకి రానివ్వని నిర్వాహకులు సోషల్ ఆడిట్ ను నిర్వహించే ప్రభుత్వేర వ్యక్తులను ఎలా అనుమతించారు? అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి. అందువల్ల సోషల్ ఆడిట్ రిపోర్టు అనే పేరుకు బదులు ఒక రహస్య నివేదిక అని వ్యవహరించి ఉంటే సమంజసంగా ఉండేది. ఇంతటి దురాగతాలు జరిగే అనాధ ఆశ్రమం వీధి పోటు భవనంలో అందరికీ కనిపించేలా ఉండటం ఆశ్చర్యకరం. బహుశా.. షూటింగుకు అనువుగా ఉంటుందని అటువంటి భవనాన్ని ఎంచుకొని ఉండొచ్చు.