రామప్ప ఆలయాన్ని నిర్మించిన రేచర్ల రుద్రుడు.. ఆయన భార్య శిల్పం
బురుజు Buruju.com: Hyderabad : అద్భుత శిల్పాలతో 800 ఏళ్ల క్రితం తెలంగాణలో రామప్ప ఆలయాన్ని నిర్మించి.. ఇప్పుడు యునెస్కో గుర్తింపును తెచ్చిపెట్టిన రేచర్ల రుద్రుడిని చూడాలని ఉందా? ఎక్కడో కాదు.. అదే ఆలయ రంగ మండప స్ధంభంపైన పొడవైన కత్తి పట్టుకొని నిలబడి ఉన్న శిల్పం రేచర్ల రుద్రుడిదే. సతీసమేతంగా.. భక్తి పారవశ్యంతో కనిపిస్తున్న ఆ శిల్పాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఆయన్ని ఒక సారి పరికించి.. ఆయన ఎంచేసిందీ తెలుసుకొంటే వడలు పులకిస్తుంది. రాణి రుద్రమ దేవికి ముందే కాకతీయ సామ్రాజ్యం ఇతరుల దాడులతో అంతరించి పోయే పరిస్థితులు తలెత్తగా.. వాటన్నింటిని చక్కదిద్ది కాకతీయ పతాకాన్ని మరో వందేళ్ల పాటు ఎగిరేలా చేసిన రేచర్ల రుద్రుడి కథ.. ఒక పాన్ ఇండియా స్థాయి సినిమాకు సరిపోయేలా ఉంటుంది. కల్పిత కథలతో బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను తీసిన రాజమౌళి.. అసలు సిసలు తెలుగు హీరో రేచర్ల రుద్రుడిపై సినిమాను తీయగలిగితే ఒక మహోన్నత చరిత్ర నేటి తరాలకు తెలుస్తుంది.
ఎప్పుడో అంతరించి పోయిన ‘పేరిణి’ శివతాండవ నాట్యం.. రామప్ప ఆలయంలో రేచర్ల రుద్రుడు చెక్కించిన శిల్ప బంగిమల కారణంగానే.. ఇప్పుడు మళ్లీ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ Nataraja Ramakrishna ద్వారా జీవం పోసుకోగలిగింది. వరంగల్ నగరానికి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలోని పాలంపేట గ్రామంలోని రామప్ప ఆలయాన్ని క్రీ.శ 1213లో నిర్మించినట్టుగా అక్కడి శాసనంలో లిఖించి ఉంది. శివాలయాన్ని.. రామప్ప ఆలయం అని ఎందుకు పిలుస్తున్నారో ఇప్పటికీ ఎవరీకీ తెలియదు. రామప్ప అనే శిల్పి వల్లనే ఆ పేరు వచ్చిందనటానికి ఆధారాలు లేవు. కాకతీయులపై ఎంతో పరిశోధన చేసిన పీవీ పరబ్రహ్మ శాస్త్రి .. రేచర్ల రుద్రుడి బిరుదులు తదితరాలను వెల్లడించారే తప్ప రామప్ప ఆలయంలోని శిల్పం ఆయనదేనని తేల్చలేదు. మరికొందరు పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి, మందల మల్లారెడ్డి మాత్రం అది ముమ్మాటికి రేచర్ల రుద్రుడుదేనని స్పష్టం చేశారు.
రామప్ప ఆలయం
యునెస్కో గుర్తింపుతో రామప్ప ఆలయం ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల సరసన చేరింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించటం వల్లనే ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందని అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేయగా.. కేంద్ర ప్రభుత్వం దీనికి కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పేర్కొంటూ వచ్చారు. నిజానికి గుర్తుంపు వచ్చేలా చేసింది నాటి కాకతీయుల సర్వ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుడ్రుడే. ఆలయంలో స్థంభాలపైన, పై భాగంలోను ఎక్కడ చూసినా జీవ కళ ఉట్టిపడేలా చెక్కిన శిల్పాలు చూపరులను కట్టిపడేస్తాయి.
యునెస్కో గుర్తింపు తర్వాత రామప్ప ఆలయానికి సందర్శకుల తాకిడి బాగా పెరిగింది
దగ్గరలోనే గల అతి పెద్ద చెరువును కూడా రేచర్ల రుద్రుడే తవ్వించాడు. ఆలయ సందర్శనకు వచ్చన వారు అక్కడికి దాదాపు 30 కి.మీ దూరంలోని లక్కవరం చెరువుపై గల తీగల వంతెనమీదగా చెరువులోని చిన్న దీవి పైకి వెళ్లోచ్చు. బోటుపైన విహరించొచ్చు. రామప్ప ఆలయానికి వెళ్లినప్పుడు రేచర్ల రుద్రుడిని చూసిరండి ( కథనాన్ని ఇతర గ్రూపుల్లో పోస్టు చేయండి)