personBuruju Editor date_rangeSun Nov 10 2024 00:00:00 GMT+0530 (India Standard Time)
హైదరాబాదుకు 50 కిలో మీటర్ల దూరంలోని రాచకొండ కోట ప్రవేశ ద్వారం
బురుజు.కాం Buruju.com కర్నాటకలో గల విజయనగర సామ్రాజ్య రాజధాని హంపిలోని ఆలయాలు, రాజ ప్రాసాదాల శిధిలాలు జగత్ ప్రసిద్ధి. అవి చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. జనరంజిక చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయులు అక్కడి నుంచే పాలించాడు. తెలంగాణ పాలకులు కనుక కాస్త దృష్టి సారించగలిగితే హైదరాబాదుకు 50 కిలో మీటర్ల దూరంలో గల రాచకొండ.. దాదాపుగా హంపి అంతటి ఖ్యాతిని పొందగలుగుతుంది. రాచకొండలోని గిరి కోట, దాని ఎత్తైన ద్వారాలు, చుట్టూ ప్రాకారాలు, కొండ దిగువన అసంఖ్యాకంగా గల ఆలయాలు, మండపాలు.. వాటిలోని శిల్పాలు, కోనేరులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొంటాయి. అక్కడి నాగాయని కొండపై ఏవో రహస్యాలు ఉన్నాయని అంటారు. వాటిని ఛేదిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. బురుజు.కాం ప్రతినిధి.. రాచకొండ గుట్టల్లో పర్యటించి ఇస్తున్న కథనాల్లో ఇది మొదటిది.
ఓరుగల్లులో కాకతీయుల పరాజయం తర్వాత.. వారి సామంతులు రేచర్ల పద్మనాయకులు రాచకొండను రాజధానిగా చేసుకొని క్రీ.శ 1324 నుంచి దాదాపు 150 ఏళ్ల పాటు పాలించారు. అక్కడ దాదాపు 500 అడుగుల ఎత్తున ఉండే కొండపై శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించారు. భక్తపోతన భాగవతాన్ని రాయటానికి ముందు.. అప్పటి రాచకొండ పాలకుడు సింగభూపాలుడిని మన్మధ రూపంగా అభివర్ణిస్తూ ‘భోగిని దండకం’ అనే కావ్యం రాశాడు. దానిలో నాటి కోట ప్రవేశం ఎంత కష్టమో చిత్రీకరించాడు. ఆయన అలా ఎందుకు రాశాడో అక్కడ ఇప్పటికీ నిలబడి ఉన్న ద్వారాలను చూసి నిర్ధారించుకోవచ్చు. పోతన తన యవ్వన ప్రాయంలో ఈ కోటలో ఉండేవాడు కనుకనే భోగిని దండకంలో నాటి కోట పరిసరాలను చక్కగా వివరించగలిగాడు. నాటి రాజులు రాచకొండలో ఏటా వసంతోత్సవాలను నిర్వహించి పండితులు, కళాకారులను సత్కరించేవారు. హంపి విజయనగరానికి మాదిరిగానే రాచకొండకు సంబంధించిన చరిత్ర ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇటీవల ఇక్కడ మల్లన్న గుట్ట సమీపంలో ఒక భారీ సొరంగం సైతం బయటపడింది. అది ఎక్కడి వరకు వెళ్తుందో ఫురావస్తు శాఖ ఇప్పటికీ శోధించలేదు. ‘ బురుజు.కాం ’ ప్రతినిధి ఇటీవల రాచకొండను సందర్శించినప్పుడు.. ఆ ప్రాంతంలోని పలు చారిత్రక ఆధారాలు గుప్త నిధుల తవ్వకాలతో ధ్వంసమవుతున్నట్టు వెల్లడయ్యింది. ఇక్కడ ఏ ఆలయాన్ని చూసినా విగ్రహాలు ఉండాల్సిన చోట భారీ గోతులు కనిపిస్తున్నాయి.
దాదాపుగా రాచకొండ కాలంనాటిదైన కర్నాటకలోని హంపీ విజయనగరం.. పర్యాటక కేంద్రంగా ప్రపంచానికి సుపరిచితం. నిత్యం అక్కడికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు
ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి తెలియని కొన్ని ఆలయాలు, గోపురాలు, మండపాలు రాచకొండలోని దట్టమైన చెట్లు, పొదల మాటున దాగి ఉన్నాయి. లోపలికి వెళ్లగలిగే అవకాశం గల ఆలయాలు, మండపాలను పరిశీలిస్తే.. ఆనాడు వీటిని వివిధ కళాకృతులు , శిల్పాలతో తీర్చి దిద్దినట్టు వెల్లడవుతుంది. ఆలయాలు, మండపాల స్థంభాలు కాకతీయుల కళారీతులను పోలి ఉంటాయి. ఇక్కడ తరచు తమకు నాణాలు, చిన్నపాటి శిల్పాలు లభిస్తుంటాయని దగ్గరలోని గ్రామాల వారు చెప్పారు. గుప్తనిధుల కోసం చాల కాలం క్రితమే విగ్రహాలను పెకలించి పడవేయగా వాటిలో కొన్ని.. సమీప గ్రామాల్లోని ఆలయాల్లోకి చేరాయి. ఆనాటి ఒక భారీ శివలింగం.. కొట దగ్గరలోని బావిలో లభించగా.. దాన్ని పైకి తీసి సమీపంలో తిరిగి ఒక పందిరి కింద ప్రతిష్ఠించారు.
రాచకొండ కోట సమీపంలోని ఒక బావిలో కొంత కాలం క్రితం కనిపించిన భారీ శివలింగం ఇది. ప్రస్తుతం ఇది అక్కడ ఒక పందిరి కింద పూజలు అందుకొంటోంది
రాచకొండ గుట్టలు వందల ఎకరాల పరిధిలో విస్తరించి ఉంటాయి. ప్రభుత్వం కనుక అవసరమైన నిధులను కేటాయించి ఇక్కడ కొన్ని చర్యలను చేపట్టగలిగితే ప్రస్తుతం దట్టమైన పొదలమాటున ఒరిగిపోయి ఉన్న కట్టడాలెన్నో బయటపడి.. అద్భుత చరిత్ర మరింతగా వెలుగు చూడటం తథ్యం. హంపి విజయనగరానికి విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తూ.. ఇక్కడి శిధిలాలను చూసి తన్మయులు అవుతుంటారు. వారు రోజుల తరబడి అక్కడే ఉంటుంటారు. దాదాపుగా హంపి కాలం నాటిదైన రాచకొండ సైతం అంతటి ఘనకీర్తిని సంపాదించగలుగుతుంది . ఇది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందినప్పుడు ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్రానికి ఆదాయమూ సమకూరుతుంది. దైనందిన కార్యక్రమాల్లో ఉక్కిరి బిక్కిరి అయ్యే నగర జీవులు రాచకొండ కోట పైకి వెళ్లి అక్కడి నుంచి కనుచూపు మేరంతా కనిపించే పచ్చని ప్రకృతిని చూసి పరవశించిపోవచ్చు. యాదాద్రి భువనగిరి , రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో రాచకొండ ఉంది. ( రాచకొండలో రహస్యాలు.. రెండో భాగం వచ్చేవారం)