personBuruju Editor date_rangeSun Nov 10 2024 00:00:00 GMT+0530 (India Standard Time)
20 ఏళ్ల క్రితం.. చారిత్రక రాచకొండ కట్టడాల పరిసరాలు నక్సల్స్, పోలీసుల మధ్య ఎదురు కాల్పులతో దద్దిరిల్లేవి. ఇప్పుడిక అటువంటి పరిస్థితులు లేనందున చారిత్రక కట్టడాలను కాపాడటం ప్రభుత్వ విధి.
బురుజు.కాం Buruju.com : ( హైదరాబాదుకు దాదాపు 50 కిలో మీటర్ల దూరంలో 700 సంవత్సరాల క్రితం రాజధానిగా వర్ధిల్లిన రాచకొండ.. ఇప్పుడు లెక్కలేనన్ని శిధిల కట్టడాలతో కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం దృష్టి సారించినా.. ఇది కర్ణాటకలోని హంపీ విజయనగరానికి ప్రస్తుతం లభిస్తున్నంతటి ఖ్యాతిని సొంతం చేసుకొంటుందని వివరిస్తూ Buruju.com అందిస్తున్న కథనాల్లో ఇది మూడోవది) రాచకొండను చారిత్రక సంపదగా పరిగణించి అభివృద్ధి చేసుకోకపోతే ఇది వేరే కార్యక్రమాలకు మళ్లీ పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ఒక ఫైరింగ్ రేంజిని ఏర్పాటు చేసుకోవాలని రక్షణ శాఖ భావిస్తోంది. సమీప గ్రామాల వారు వ్యతిరేకించటంతో ఆ శాఖ ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది. సినిమా స్టూడియో నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతమనే భావనను.. పాలనా పగ్గాలు చేపట్టిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తం చేసి.. సినీ వర్గాలను రాచకొండ ఆకర్షించేలా చేశారు.
పై ఫొటోను కాస్త పరిశీలనగా చూస్తే.. రాచకొండ గుట్టను ఆనుకొని 700 ఏళ్ల క్రిత నిర్మించిన అనేక కట్టడాలు కనిపిస్తాయి
ఒకప్పుడు భక్త పోతన, శ్రీనాధుడు వంటి ఉద్ధండులు ఎందిరినో విశేషంగా ఆకట్టుకొన్న రాచకొండ Rachakonda .. ఇరవై ఏళ్ల క్రితం కొంతకాలం పాటు నక్సలైట్లు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులతో మారుమోగిపోయింది. రాచకొండ పేరుతో ఒక నక్సల్స్ దళం ఉండేది. రాచకొండ కోటను ఆనుకొని ఉన్న అడవుల్లో నక్సల్స్ తలదాచుకొనేవారు. దళంలోని పలువురు సభ్యులు ఇక్కడి అడవుల్లోనే పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. హైదారాబాదు పోలీసు కమిషనరేటు నుంచి 2016లో 42 పోలీస్ స్టేష్లను వేరు చేసి వాటి కోసం కొత్తగా ఏర్పాటు చేసిన కమిషనరేటుకు ప్రభుత్వం రాచకొండ పేరు పెట్టింది. దీంతో రాచకొండ గురించి తెలుసుకోవటానికి యువత ఆసక్తి చూపిస్తోంది.
రాచకొండ గుట్టలపై గల కోటలోకి వెళ్లాలంటే ఇటువంటి ప్రధాన ద్వారాలను దాటాల్సివుంటుంది. ఇప్పటికీ పై కప్పు కొంత మేర కూలకుండా ఉండటం పొటోలో చూడొచ్చు. ఆనాడు.. సున్నం వంటిది ఏదీ వాడకుండా భారీ రాళ్లను పొందికగా అమర్చిన తీరును చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది
ఆనాడు.. రేచర్ల పద్మనాయకుల రాజధానైన రాచకొండలో అన్ని మత సంప్రదాయాలు ఉండేవని నాటి కట్టడాల ద్వారా స్పష్టమవుతోంది. ఇక్కడి ఆలయాల్లో శివుడు, వీరభద్రుడు, శ్రీరాముడు, తదితరులతో పాటు అక్కడక్కడ శిలలపై భైరవ , గరుడ , అంజనేయుని విగ్రహాలు చెక్కి ఉన్నాయి. ఒక శిలపై దిగంబర ప్రతిమ ఉంది. ఇక్కడ జైనం కూడా ఉండేదని చెప్పేందుకు ఈ శిల్పం ద్వారా గ్రహించొచ్చు. నాటి రాజులు వేయించిన శాసనాలు కొన్ని చోట్ల ఉన్నాయి. రాచకొండ దుర్గాన్ని నిర్మించిన అనపోతనాయుడు గురించి ఇక్కడ శాసనంలో లిఖించి ఉన్నట్టు చరిత్రకారులు వెల్లడించారు. రాచకొండ పాలకులు జనరంజికంగానే పాలించినట్టుగా చరిత్రపుటల్లో ఉన్నప్పటికీ.. అక్కడ ఒక రాజు పన్నులతో ప్రజలను పీడించేవాడనీ ఒక కథ ప్రచారంలో ఉంది. చరిత్రకారులు ఆదిరాజు వీరభద్రరావు.. 1950 ప్రాంతంలో రాచకొండ ప్రాంతీయులు చెప్పిన కథను తన గ్రంధంలో ఇలా వెల్లడించారు... ‘‘ రాచకొండ దుర్గానికి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో.. స్తనాలను చెక్కి ఉన్న ఒక మాతృమూర్తి శిల్పం ఉంది. నాటి ఒక రాజు రకరకాల పరిణామాలుగల గిన్నెలను చేయించి వాటిని ప్రతి స్త్రీ వద్దకు భటులతో పంపేవాడు. బటులు వారి స్తనాలను ఆయా గిన్నెలతో కొలిచి ఏ గిన్నెకు సరిపోతే ఆ గిన్నెడు మాడలను రాజుగారికి కప్పంగా వసూలు చేసేవారు, ఒక సారి అలా స్తనాన్ని కొలిచేందుకు రాజ బటులు వస్తుండగా.. ఒక మహిళ ఈ అరాచక పన్ను విధాన్ని నిరసిస్తూ.. తన స్తనాలను కోసుకొని, రాజును, రాజ్యాన్ని శపిస్తూ దేహ త్యాగం చేసింది. ఆమె కారణంగానే రాచకొండ రాజ్యం నశించిపోయిందని అక్కడి వారు చెప్పారు’’ అని వీరభద్రరావు వెల్లడించారు.
రాచకొండలోని దాదాపుగా అన్ని ఆలయాలు, మండపాలు.. గుప్త నిధుల కోసం ఇలా తవ్వేసి ఉన్నాయి
స్థానికులు చెప్పిన కథలో వాస్తవమెంతో తెలియదుకాని.. స్తనాలతో గల మాతృమూర్తి ప్రతిమలు శాతవాహనుల కాలానికి చెందినవిగా చెప్పవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధూళికట్ట వద్ద ఇటువంటి ప్రతిమలు లభించాయి. వీటిపై ఆరుద్ర తన ‘ ‘సమగ్రాంధ్ర సాహిత్యం’లో ఇలా రాశారు ‘‘ స్తనాలు మాతృత్వధారకు నిలయాలు. లోక సంతానానికి ఆకలి పోగొట్టే ఆహార పోషకాలు. తమ దేవతలకు ఎన్నో చేతులు, ఎన్నో తలలు ఉన్నాయని భావించినట్టే తమ దేవతలకు బహుళ స్తనాలు ఉన్నట్టు ఊహించుకొని బొమ్మలు చేసుకొన్నారు’’ అని విశ్లేషించారు. రెండు స్తనాలను చేతులతో పట్టుకొని ఉన్ననాటి ప్రతిమ ఫొటోను అదే గ్రంధంలో ఆయన పొందుపర్చి.. అమె ‘కుమరి’ దేవతలా కనిపిస్తోందని, ఆమెకు గుడులు కూడా ఉండేవని పేర్కొన్నారు. రాచకొండలోనూ అటువంటి ప్రతిమే ఉన్నట్లైతే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే శాతవాహనుల కాలంలో రాచకొండ ప్రాంతం విరాజిల్లిందా? అనే సందేహాలు వ్యక్తం కాకమానవు. సమగ్ర తవ్వకాల ద్వారానే ఇటువంటి సందేహాలకు సమాధానం లభిస్తుంది ( నాలుగో భాగం వచ్చేవారం)