కోపిష్టి దగ్గుబాటి వద్ద.. భార్య పురందేశ్వరి అనుసరించిన సూత్రం ఇదీ !
personBuruju Editor date_range2023-01-18
కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి
బురుజు.కాం Buruju.com : ‘‘ భర్త కోపంతో ఉన్నప్పుడు అతనితో అసలు మాట్లాడకుండా మౌనం వహించాలి. అతని కోపమంతా మటుమాయమయ్యాకనే భార్య తాను చెప్పదలచుకొన్నది చెప్పాలి’’ భర్త.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు Daggubati venkateswara rao వద్ద పురందేశ్వరి అనుసరించే సూత్రం ఇది. ఇటువంటి విధానం వల్లనే తమ దాంపత్యం అన్యోన్యంగా కొనసాగినట్టు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం.. భాజపాలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి.. మహా నటుడు ఎన్టీఆర్ కుమార్తె కావటం తెలిసిందే. ఆమె భర్త.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా.. పలు సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసి.. ఇక తాను రాజకీయాల నుంచి విరమించుకొంటున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ అధినేత రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ అనే కార్యక్రమంలో.. దగ్గుబాటి దంపతులు తాజాగా పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి
తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరావు.. తన మామగారైన ఎన్టీఆర్ కు వెన్నంటే ఉన్నారు. తొలినాళ్లలోనే ఒక సందర్భంలో.. ఎన్టీఆర్ పై కొన్ని కాగితాలను విసిరిగొట్టి వచ్చేశానంటూ వెంకటేశ్వరావు బయటపెట్టారు. ఆయన చెప్పిన మరికొన్ని సమాధానాలను బట్టి కూడా ఆయన కోపిష్టి అని స్పష్టమవుతుంది. మరి.. ఇటువంటి కోపిష్టి భర్తతో పురందేశ్వరి Purandeswari ఎలా నెట్టుకొచ్చినట్టు? దీనికి సమాధానాన్ని ఆమే చెప్పారు. ‘‘ మా అమ్మ (ఎన్టీఆర్ సతీమణి బసవతారకం) నాకో సూత్రం చెప్పారు. అదేమిటంటే.. భర్త కోపంగా ఉన్నప్పుడు భార్య ఎటువంటి వాదనలకు దిగకూడదు. అప్పటికి మౌనంగా ఉండిపోవాలి. అది భార్యకు , దాంపత్యానికి మంచిది. ఆయన కోపం తగ్గిన తర్వాత.. భార్య చెప్పదలచుకొన్నది విడమర్చి చెప్పాలి. అప్పుడు విషయం ఒక ముగింపునకు వస్తుంది అని అమ్మ చెప్పిన మాటల్నే నేను అనుసరిస్తూ వస్తున్నాను ’’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.
నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. ఆయన సతీమణి బసవ తారకం
మౌన సూత్రం భర్త వెంకటేశ్వరరావును చాలా ఆలోచనల్లో పడేస్తూ వచ్చేదని ఇదే ఇంటర్వ్యూలో తేటతెల్లమయ్యింది. అదెలా అంటే.. వెంకటేశ్వరరావు కోపంగా ఉన్నప్పుడు పురందేశ్వరి ఏకంగా మూడు, నాలుగు రోజులు మౌనం వహించి ఇక ఆయనతో ఏమీ మాట్లాడేవారు కారు. ‘ సాధారణంగా నా కోపం పది నిముషాల్లో పోతుంది. కాని.. ఆమె మాత్రం మూడు, నాలుగు రోజులు మాట్లాకపోవటం నాకు చాలా ఇబ్బందిగా ఉండేది’ అని ఆయన వాపోయారు. అంతే కాదు.. ఇన్నేళ్లపాటు చవి చూసిన అనుభవాలతో.. కోపంపై వెంకటేశ్వరరావుకు ఒకవిధమైన ఏవగింపు కూడా వచ్చినట్లుంది. అందుకే ఆయనా ఒక సూత్రీకరణను వెల్లడించారు. అనుకొన్నది జరగటానికి, అవతలి వారిని దారిలో పెట్టుకోవటానికి కోపాన్ని తెచ్చిపెట్టుకోవాలేతప్ప నిజంగా కోపాలు ఉండకూడదని ఆయన అన్నారు. మొత్తం మీద.. భర్త వాదనలకు దిగుతున్నప్పుడు భార్య, భార్య వాదిస్తున్నప్పుడు భర్త.. మౌనం వహించగలిగితే.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి మాదిరిగా సంసారాలు సుఖంగా ఉంటాయి.