అల్లూరిపై జానపద గేయాలు ఎందుకు పుట్టలేదు? ( తొమ్మిదో భాగం)
personBuruju Editor date_rangeWed Dec 20 2023 00:00:00 GMT+0530 (India Standard Time)
ఎంతో మంది వీరులపై జానపదగేయాలను అల్లిన గ్రామీణ కళాకారులు అల్లూరి విషయంలో ఎందుకు మౌనం వహించిందీ తెలుసుకోవటమూ పరిశోధనాంశమే
బురుజు.కాం Buruju.com : (అల్లూరి శ్రీరామరాజు తమ అధీనం నుంచి తప్పించుకొని పారిపోతుంటే కాల్చివేసినట్టుగా బ్రిటీష్ అధికారులు తమ రికార్డుల్లో రాసుకొన్నారు. లొంగిపోయిన అల్లూరిని.. యద్ధ ఖైదీగా పరిగణించకుండా నిర్ధాక్షణ్యంగా కాల్చిచంపారని నిరూపించేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడొక కమిషన్ ను ఏర్పాటు చేయాలని సూచిస్తూ.. కొంగ్రొత్త అంశాలతో బురుజు.కాం అందిస్తున్న కథనాల్లో ఇది తొమ్మిదోవది ) బ్రిటీష్ పాలకుల వ్యూహాత్మక పోకడల కారణంగా.. అల్లూరి సీతారామరాజు Alluri Seetharama Raju వీరోచిత పోరాటంపై చెప్పుకోతగిన రీతిలో సంప్రదాయ జానపద గేయాలు వెలువడలేదు. సీతారామరాజు పారిపోతుండగా కాల్చవేశామంటూ బ్రిటీష్ ప్రభుత్వం 1924, మే 16వ తేదీన చేసిన ప్రకటనను ప్రజలు నమ్మలేదు కనుకనే ఆయనపై జానపద గేయాలను వారు సృష్టించలేదని భావించాలి. సీతారామ రాజు ఎదురు కాల్పుల్లో చనిపోయినట్టుగా బ్రిటీష్ సర్కారు ప్రకటించి ఉంటే ప్రజలకు ఆయన మృతిపై అనుమానాలు ఉండేవి కావు. అప్పుడు వీర రసం ఉప్పొంగే రీతిలో ఆయనపై బాణీలను కట్టి ఉండేవారు. ఆయన తప్పించుకొని ఎక్కడో సజీవంగా ఉన్నాడని, ఏనాటికైనా మళ్లీ రణభేరి మోగిస్తాడని ప్రజలు విశ్వసించటం వల్లనే జానపద గేయాలను విరివిగా రాయలేదని జానపద పరిశోధకులు తేల్చారు.
అల్లూరిపై ఒకటి అరా తప్ప గేయాలు అసలు లభించలేదని జానపద పరిశోధకులు తేల్చారు
అల్లూరిపై నాటి ప్రజానీకం నుంచి పుట్టిన ఒక గేయంలోని కొంత భాగాన్ని ప్రముఖ జానపథ పరిశోధకులు బిరుదురాజు రామరాజు తన ‘తెలుగు జానపథ సాహిత్యం’ గ్రంధంలో ప్రస్తావించి.. గేయాన్ని పూర్తిగా సేకరించాల్సివుందని పేర్కొన్నారు. ఎవరు రాశారో కాని ఆ గేయం ఆ నాటి పరిస్థితికి అద్దం పడుతోంది. ‘‘ ప్రకటన ఒక తీరు.. ప్రజల ధోరణి వేరు.. నిజము తెలియగలేదు దారి.. నీదు మరణ వార్తను నమ్మరైరి’’ అనే పంక్తులను మాత్రం బిరుదురాజు రామరాజు సేకరించగలిగారు. సీతారామరాజుకు అత్యంత సమీప కాలంలో వెలసినది అవ్వటం వల్ల ఇది ఆయనపై వచ్చిన బుర్రకథ కన్నా ప్రామాణికమైన జానపథ గేయ లక్షణాలతో ఉందని ఆయన విశ్లేషించారు. సీతారామరాజు అసువులు బాసినట్టుగా గేయసాహిత్యం లేకపోవటం వల్ల కూడా ఆయన పారిపోయి ఎక్కడో ఉన్నారనే ప్రజల భావనకు ఊతమిచ్చింది. . జానపద వీరగాధ సృష్టికి కావాల్సినన్ని అంశాలు సీతారామరాజు జీవితంలో ప్రస్పుటమవుతున్నా.. ఆయన మృతిని జానపదులు విశ్వసించనందున వారి నుంచి ఆయనపై సంప్రదాయక వీరగాథ జానపదాలు పుట్టలేదని మరో ప్రఖ్యాత జానపద గేయాల పరిశోధకులు తంగిరాల వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. సీతారామరాజుపై బుర్రకథలు రాసినా అవి సంప్రదాయక వీరకథల కోవలోకి రావని ఆయన విశ్లేషించారు.
అల్లూరిపై బుర్రకథలు చెప్పినా.. అవి సంప్రదాయక వీర గాథల కిందకు రావని ప్రముఖ జానపథ పరిశోధకులు తంగిరాల వెంకట సుబ్బారావు విశ్లేషించారు
సీతారామరాజు చనిపోయిన 16 ఏళ్ల తర్వాత కూడా ఆయనపై వెలువడుతున్న బుర్రకథలకు బ్రిటీష్ ప్రభుత్వం కలవరపడింది. ఆయనపై 1941లో చెబుతున్న బుర్రకథను నిషేధించింది. విశేషమేమింటే.. స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో సైతం నిషేధం కొనసాగింది. ఇటువంటి పోకడలు కూడా సీతారామరాజు మరణం వెనుక ఏదో రహస్యం దాగి ఉందనే సందేహాలకు బలన్నిచ్చాయి. బుర్రకథను ప్రభుత్వం నిషేధించటాన్ని ‘ నవయుగ’ అనే తెలుగు పత్రిక 1941లో ఇలా రాసింది.. ‘‘ అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారితో పోరాడిన ఆంధ్రా వీరుడు. ఆయనంటే బ్రిటీష్ వారికి బెదురు, ద్యేషం. ప్రతి భారతీయుడు సీతారామరాజు వంటి త్యాగి, యోధుడు అవ్వాలని ఆశించాల్సిన ప్రజా ప్రభుత్వం ఈ నిషేధం ఎందుకు పెట్టాలి? ఇవ్వన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రివర్గం అధికారంలో ఉండగానే జరిగాయి’’ అని విమర్శించింది. అల్లూరి స్పూర్తితో మరింత మంది అల్లూరి సీతారామరాజులు తయారు కాకుండా చూసుకొనేందుకు బ్రిటీష్ వారు వేసిన ఎత్తులను ఆ నాటి మన నేతలు అడ్డుకోలేకపోయరని స్పష్టమవుతోంది ( అల్లూరిపై 10వ భాగం వచ్చేవారం)