న్యూజిల్యాండులోని బ్రాడ్రోనాలో నిత్యం కనిపించే దృశ్యాలివి
బురుజు.కాం Buruju.com : మహిళలు తమ లోదుస్తులైన ‘బ్రా’ లను విప్పి.. వరసగా తీగలకు వేలాడదీసే విచిత్ర పద్దతి ఒకటి న్యూజిల్యాండ్ మరికొన్ని దేశల్లో వేళ్ళూనుకొంటోంది. న్యూజిల్యాండులో ఇప్పుడీ పిచ్చి ఎంత వరకు వెళ్లిందంటే.. స్వయంగా వెళ్లి బ్రాను విప్పి ఇవ్వలేని వారు దాన్ని కొరియరు ద్వారానూ అక్కడికి పంపుకోవచ్చు. ఇలా బ్రాలను వేలాడదీసే తీగలు గల ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా మారిపోతున్నాయి. మంచి భర్త లభించాలనే భావనతోనే ఇలా బ్రాలను వేలాడదీస్తున్నారనే ప్రచారం ఒకటి ఉండగా.. అక్కడ బ్రాలను వేలాడదీసిన తర్వాత.. అందజేసే విరాళాలను రొమ్ము క్యాన్సరుకు ఖర్చుపెడుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. బ్రాలను చూడటానికి వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా పెరిగి పోతుండటంతో న్యూజిల్యాండులోని కార్డ్రోనా ప్రాంతం పేరు కాస్తా.. ‘బ్రాడ్రోనా’గా మారిపోయింది. అక్కడ పర్యాటకులు విడిది చేసేందుకు హోటళ్లూ ఏర్పాటవుతున్నాయి.
బ్రాల వద్ద న్యూజిల్యాండ్ యువతి
ప్రముఖ తెలుగు రచయిత తాపి ధర్మారావు 1936లో రాసిన ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?’ అనే పుస్తకం పేరు చాల మంది నోళ్లల్లో ఇప్పటికీ నానుతూనే ఉంటుంది. తెలుగులో బాగా ప్రచారంలో ఉన్న.. ‘పండగ నాడూ పాత మెుగుడేనా?’ అనే లోకోక్తి ఎలా ఆవిర్భవించిందో ఆ పుస్తకంలో ఆయన వివరించారు. ఉత్తర హిందూస్థానులోని రామామేళాలో ఒక విచిత్రమైన పండగను ఏటా నిర్వహించేవారని, ఆ రోజున మహిళలు తమ రవికలను (జాకెట్లు) ఒక చోట వేసి చెట్ల చాటున దాకొనేవారిని, అనంతరం.. ఏ పురుషుడు ఎవరి రవికను తీస్తే అతనితో ఆ రవికకు చెందిన మహిళ
ఆ రోజుకు వెళ్లాల్సివుండేదని వెల్లడించారు. ఇలా ఒక సారి రవికను తీసిన వ్యక్తి ఆమె భర్తే కావటంతో దానిని వేసినామె మనస్సు చివుక్కుమందంటూ రాసుకొచ్చి.. ‘పండగనాడూ పాతమొగుడేనా’ అనే లోకోక్తి అలా పుట్టుకొచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు.. న్యూజిల్యాండ్ NewZealand విషయానికి వస్తే.. అక్కడ తాపీ ధర్మారావుగారు చెప్పిన పద్దతిలో కాదుకాని.. మహిళలు బ్రాలను తీసి తీగలకు వేలాడదీయటం వేలంవెర్రిగా మారిపోతోంది. మహిళలు అక్కడికక్కడే బ్రాలను విప్పి తీగలకు కట్టి వెళ్లిపోతుంటారు. ఆ పక్కన రహదారి మీదగా ప్రయాణించేవారు సైతం అక్కడ బ్రాలను వేసి వెళ్తున్నారు. వీటిని బ్రా ఫెన్స్ Bra fence అని వ్యవహరిస్తున్నారు.
న్యూజిల్యాండులోని కారోనా లోయలోని ఒటాగా ప్రాంతంలో తొలుత 1990లో ఒక తీగకు బ్రాలు కనిపించాయి. ఇక అప్పటి నుంచి రోజురోజుకు వీటి సంఖ్య పెరిగిపోతుండటంతో తీగలను ప్రస్తుత బ్రాడ్రోనా ప్రాంతానికి మార్చాల్సివచ్చింది. మహిళలు వచ్చి బ్రాలను తీసి వేస్తున్నారనే విషయం మిడీయా ద్వారా ప్రచారం కావంతో విదేశస్తులు సైతం అక్కడికొచ్చి తమ బ్రాలను తీసి తీగలకు కడుతున్నారు. ఇప్పుడక్కడ బ్రాలు వేల సంఖ్యలో ఉన్నట్టు అక్కడి వారు చెబుతున్నారు. తీగలను బ్రాడ్రోనాకు మార్చినప్పుడు మొదలైన ‘బ్రా’ల పండగను.. ఇప్పుడు ఏటా నిర్వహించటం సంప్రదాయంగా మారిపోయింది. న్యూజిల్యాండులోని నెల్సాన్, తపవేరా, వైరార్పా వంటి ప్రాంతాల్లోను ఇటీవల కాలంలో బ్రాల తీగలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ఐస్ ల్యాండ్ వంటి దేశాలకూ ఇది పాకుతోంది.
విరాళాలను అందజేస్తే వాటిని ఖచ్చితంగా రొమ్ము క్యాన్సరుకు వినియోగిస్తామంటూ వెలిసిన బోర్డు
‘బ్రా’ల తీగల నిర్వహణకు సంస్థలూ ఏర్పాటవుతున్నాయి. బ్రాలను వ్రేలాడదీస్తే శుభం కలుగుతుందనే భావన దూర ప్రాంతాలవారికి సైతం ఏర్పడటంతో.. ఇప్పుడు కొన్ని సంస్థలు బ్రాలను కొరియర్ ద్వారా పంపించుకోవచ్చని చెబుతున్నాయి. అంతేకాదు.. పంపిన బ్రాను ఖచ్చితంగా వేలాడదీస్తామంటూ హామీ ఇస్తున్నాయి. న్యూజిల్యాండులోని బ్రాడ్రోనాలో గత కొంత కాలంగా గులాబీ రంగు డబ్బాల ద్వారా విరాళాలను సేకరిస్తున్నారు. బ్రాను కట్టినవారు ఎంతో కొంత మొత్తాన్ని వాటిలో వేస్తున్నారు. సొమ్మును రొమ్ము క్యాన్సరు కోసం వినియోగిస్తున్నామని ఆయా సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు.