కేరళ రాజధాని త్రివేండ్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న నేషనల్ మూమెంట్ ఫర్ ఓపీఎస్ సెక్రటరీ జనరల్, తెలంగాణ అధికారి స్థితప్రజ్ఞ
బురుజు.కాం Buruju.com : తాము చేపట్టిన ఉద్యమ ఫలితంగా.. దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల నూతన పింఛను పథకం ( సి.పి.ఎస్ ) రద్దయ్యిందని ‘నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం’ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ వెల్లడించారు. మిగతా రాష్ట్రాల్లో కూడా దీనిని రద్దు చేసి.. పాత పింఛను పథకాన్ని (ఒ.పి.ఎస్ ) అమల్లోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త పింఛను పథకంలో ఉంటూ పదవీ విరమణ చేసిన, మరణించిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఏవీ అందటంలేదని, ఉద్యోగులకు సామాజిక భద్రతంటూ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
సమావేశానికి హాజరైన ప్రతినిధులు
పాత పింఛను పథకం పునరుద్ధరణపై రిజర్వు బ్యాంకు చేస్తున్న వ్యాఖ్యలు సమంజసంగా లేవని , ఉద్యోగుల సంక్షేమం పట్ల రాష్ట్రాలకు రాజ్యాంగంలోని 309 అధికరణం ద్వారా సంపూర్ణ అధికారాలు ఉంటాయని తెలంగాణ అధికారి అయిన స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. కేరళ రాజధాని త్రివేండ్రంలో.. సచివాలయం ముందు జనవరి 21వ తేదీన నిర్వహించిన ఉద్యోగుల ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగుల సొమ్మును షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టటం ద్వారా కార్పోరేట్ల కొమ్ముకాసే పథకంగా సి.పి.ఎస్ మారిందని విమర్శించారు. ‘‘ ఉద్యోగికి అందాల్సిన పింఛను.. అతని జీతంలో కనీసం 50 శాతం మేర ఉండాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ 1952లో తీర్మానించింది. కేరళలోని రెండు లక్షలకు పైగా సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెందిన రూ.10వేల కోట్లకు పైగా సొమ్ము షేర్ మార్కెట్లలోకి పెట్టుబడిగా వెళ్లింది. కమ్యునిస్టు పార్టీలు కార్పోరేట్ల పెట్టుబడుల గురించి కాకుండా ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించాలి’ అని స్థితప్రజ్ఞ విజ్ఞప్తి చేశారు.
ధర్నాలో పాల్గొన్న కేరళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు
పాత పింఛను విధానాన్ని తెస్తామని హామీ ఇచ్చిన పార్టీలకే రానున్న ఎన్నికల్లో ఓటు వేస్తామంటూ .. ధర్నాలో పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ధర్నాలో.. తెలంగాణ నుంచి ఉద్యమ సంఘం ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.