పుష్పగుచ్ఛాలకు బదులు.. పలకలు తీసుకొన్న కలెక్టరే.. తెలంగాణ కొత్త సీఎస్
personBuruju Editor date_range2023-01-29
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
పిళ్లా సాయికుమార్ Buruju.com బురుజు.కాం : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Telangana chief secretary-CS ) గా జనవరి12వ తేదీన బాధ్యతలను స్వీకరించిన శాంతికుమారి.. 20 ఏళ్ల క్రితం అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టరుగా పనిచేసినప్పుడు ఒక అద్భుత ప్రక్రియకు నాంది పలికారు. నూతన సంవత్సరం ఆరంభం రోజైన జనవరి 1వ తేదీన.. తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన వారి నుంచి ఆమె పుష్పగుచ్ఛాలు, మిఠాయి బాక్సులకు బదులు.. పలక, బలపాలను స్వీకరించారు. అలా వచ్చిన దాదాపు 25వేల పలకలను ఆమె.. అప్పటి రాత్రి పాఠశాలల్లోని వయోజనులకు పంపిణీ చేయించారు. ప్రస్తుత ఉభయ రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్ప గుచ్ఛాలకు బదులు నోట్ పుస్తకాలను తీసుకోగలిగితే.. పేద విద్యార్ధులు ఎందరికో అవి ఉపయోగపడతాయి.
2001, జనవరి 1వ తేదీన తనకు అందిన పలకలతో అప్పటి కలెక్టరు హోదాలో శాంతికుమారి
ఐఏఎస్ అధికారిణి శాంతికుమారి IAS Shanthi Kumari .. ఉమ్మడి అదిలాబాదులోను ,ఆ తర్వాత మెదక్ జిల్లాలోను కలెక్టరుగా పనిచేశారు. మెదక్ జిల్లాకు ఆమె కలెక్టరుగా ఉన్న సమయంలో నేను.. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ‘ఈనాడు’ ప్రతినిధిగా పనిచేశాను. ప్రతి జనవరి 1వ తేదీన అధికారులు పుష్ప గుచ్ఛాలు, స్వీట్ బాక్సులతో వచ్చి కలెక్టరుకు శుభాకాంక్షలు చెప్పటం ఆనవాయితి. ఇటువంటి విధానానికి కొన్ని సవరణలు చేసి.. ఆ రోజున పలక, బలపాలను తీసుకోవాలంటూ నేను చేసిన సూచనకు కలెక్టరు శాంతికుమారి వెంటనే అంగీకరించారు. కలెక్టరు కేవలం పలక, బలపాలను మాత్రమే తీసుకొంటారంటూ నేను ‘ఈనాడు’ లో ముందుగానే రాయటంతో.. ప్రజల్లోనూ అది చర్చనీయాంశమయ్యింది.
తొలుత వంద పలకలతో వచ్చి శుభాకాంక్షలు చెప్పిన నాటి మెదక్ జిల్లా ఎస్పీ వేణుగోపాల కృష్ణ
2001, జనవరి 1 వ తేదీన ఉదయాన్నే నేను, ‘ఈనాడు’ ఫొటో గ్రాఫర్ కుంట్ల శ్రీనివాస్ కలసి సంగారెడ్డిలోని కలెక్టరు ఇంటికి వెళ్లాము. తొలుత ఎవరూ రాకపోవటంతో పలకలు ఇవ్వటం అధికారులకు ఇష్టంలేదేమోనని మేము నిరాశ చెందాము. కలెక్టరు కూడా ఇంటి లోపలకు వెళ్లిపోయారు. కొంత సేపటికి.. అప్పటి జిల్లా ఎస్పీ వేణుగోపాల కృష్ణ దాదాపు 100 పలకలతో వచ్చారు. ఇక అక్కడి నుంచి ప్రతి అధికారి ఎన్నో కొన్ని పలకలను పట్టుకొని వస్తూనే ఉన్నారు. వారంతా వరసగా నిలబడి వాటిని ఇస్తుంటే శాంతకుమారి ఎంతో ఆప్యాయంగా వాటన్నింటిని స్వీకరించారు. సరిగ్గా.. అప్పుడే మరో సంఘటన చోటు చేసుకొంది. హైదరాబాదులోని తెలుగు దేశం నాయకుడైన అరవింద కుమార్ గౌడ్.. సారధ్యంలో.. పాత నగరానికి చెందిన కొందరు వ్యాపారులు ఏకంగా ఒక డీసీఎం వాహనంలో పెద్ద సంఖ్యలో పలకలను తీసుకొచ్చి కలెక్టరుకు అందజేశారు. వయోజనులకు అక్షరాలను నేర్పించేందుకు ఉపయోగపడే పలకలను కలెక్టరు స్వీకరించటాన్ని తామంతా ఒక మంచి కార్యక్రమంగా భావించామని ఆ వ్యాపారులు పేర్కొన్నారు. ఆ రోజున దాదాపు 25 వేల పలకలు అందగా వాటన్నింటిని అప్పటి అక్షర సంక్రాంతి కార్యక్రమం అధికారిణి ద్వారా రాత్రి పాఠశాలల్లోని వయోజనులకు కలెక్టరు పంపిణీ చేయించారు. ఆ తర్వాత ఆమె జిల్లాలో ఎక్కడికెళ్లినా అధికారులు పలకలను ఇచ్చి స్వాగతం పలికేవారు. సొంత జిల్లా అయిన మెదక్ లో.. శాంతికుమారి పని తీరును స్వయంగా చూసుండటం వల్లనే ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించింది మొదలుకొని కేసీఆర్.. ఆమెకు కీలక బాధ్యతలను అప్పగిస్తూ వచ్చి.. ఇప్పుడు సీఎస్ పదవికి ఎంపిక చేశారు. శాంతికుమారి కలెక్టరుగా పనిచేసినప్పుడు కేసీఆర్.. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు.
సీఎస్ గా జనవరి 12వ తేదీన బాధ్యతలను స్వీకరించిన సమయంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. మొక్కను అందజేస్తున్న శాంతికుమారి. ముఖ్యమంత్రి మాత్రం ఆమెకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చారు
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన రోజున కేసీఆర్.. సచివాలయ ఆవరణలో ఉద్యోగులతో మాట్లాడుతూ.. తనకు పుష్పగుచ్ఛాలను ఎవరూ ఇవ్వొద్దని అన్నారు. ఆయన ప్రసంగాన్ని నేను ‘ఈనాడు’లో రాశాను. వాటికి బదులుగా ఏవి ఇవ్వాలో మాత్రం సీఎం చెప్పలేదు. ఒట్టి చేతులతో ఎవరూ వెళ్లరు కనుక పుష్పగుచ్ఛాల సంప్రదాయం యధాప్రకారం కొనసాగుతూనే ఉంది. పుష్పగుచ్ఛాలు అప్పటికప్పుడే చెత్త బుట్టల్లోకి చేరిపోతుంటాయి. స్వీటు బాక్సులను ఆయా కార్యాలయాల్లోని సిబ్బందే తీసుకెళ్లి పోతుంటారు. వీటికి బదులు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటి వాటిని కనుక తీసుకొంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదుకొనే పేద విద్యార్ధులు ఎందరికో వాటిని అందజేయవచ్చు. తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు ఇటువంటి నిర్ణయాలను తీసుకోవాలి ( మోదీ 2014లో తెచ్చిన ఆదర్శ గ్రామాల పథకాన్ని అప్పటికి 13 ఏళ్ల క్రితమే అమలు చేసిన శాంతికుమారి..రెండో భాగం వచ్చేవారం ‘బురుజు’లో.. )