థాయల్యాండ్ లో గంజాయితో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్ధాలను విక్రయిస్తున్న దృశ్యం
బురుజు.కాం Buruju.com : అక్కడ.. గంజాయిని తినిపించి కోళ్లను పెంచుతారు. వాటి మాంసాన్ని ప్రజలు విరగబడి కొంటున్నారు. చల్లటి ఐస్ క్రిముపై గంజాయి పొడిని చల్లి ఇస్తే లొట్టలేసుకొని లాగించేస్తున్నారు. గంజాయి ఆకులతో చేసిన టీ ని బాగా ఇష్టపడుతున్నారు. ఇవన్నీ.. థాయల్యాండ్ లో ఇటీవల కాలం పరిణామాలు. గంజాయిని అక్కడ కొద్ది పాటి షరతులతో చట్ట బద్దం చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో 19 రాష్ట్రాల్లోను, కెనడాలోను గంజాయి సులభంగా లభిస్తోంది. భారత దేశంతో సహా కొన్ని దేశాల్లో మాత్రం గంజాయిని పెంచటం, అమ్మటం, వాడటం నిషేధం. అయినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్ధాలుగా చాటుమాటుగా గంజాయి అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి.
గంజాయి పొడిని జల్లి ఇచ్చేవాటితో పాటు.. నేరుగా గంజాయితో తయారు చేసిన ఐస్ క్రీములకూ ఇప్పుడు థాయల్యాండ్ పేరు పొందుతోంది
గంజాయిపై అంతర్జాతీయ స్థాయిలో ఒక సరైన విధానమంటూ కొరవడింది. దీంతో.. దేశాలు తమకు తోచిన రీతిలో వ్యవహరిస్తున్నాయి. మసాజులు వంటి కార్యకలాపాలకు పేరుపడ్డ థాయల్యాండ్.. ఇటీవల రకరకాల గంజాయి ఉత్పత్తులను ప్రజల ముందుకు తెచ్చి మత్తు రుచి చూపిస్తోంది. రోడ్ల పక్క ఉండే హోటళ్లు, దుకాణాల్లోను ఇవి విరివిగా లభిస్తున్నాయి. గంజాయితో వివిధ రకాల కూరలను సైతం వండుతున్నారు. కూరలపై మనం కొత్తిమీర వేసుకొన్నట్టుగా.. వారు గంజాయి ఆకులను జల్లుతున్నారు. గంజాయి పువ్వులతో అలంకరించిన వస్తువులనూ అక్కడ గిరాకీ ఏర్పడుతోంది. థాయల్యాండ్ ప్రజా ఆరోగ్య శాఖ మంత్రి రకుల్.. గంజాయిని చట్టబద్దం చేస్తామంటూ 2019 ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి విజయం సాధించి.. ఇప్పుడు ఎన్నికల హామీని నిలబెట్టుకొన్నారు.
కోళ్లకు దాణాగా గంజాయిని వేసిన దృశ్యం . ఇటువంటి కోళ్ల మాంసాన్ని ఇప్పుడు ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు
కొన్ని దేశాలు గంజాయిని పూర్తిగా నిషేధించకుండా అనుమతించిన చోట మాత్రం విక్రయించుకొనేలా వ్యవహరిస్తున్నాయి. నెథర్లాండ్స్ లో అనుమతించిన కాఫీ షాపుల్లో గంజాయిని వినియోగించొచ్చు. జర్మనీ, శ్రీలంక, ఇంగ్లాండు వంటి 49 దేశాలు గంజాయిని ఔషధాల తయారీలో వాడుతున్నాయి. పాకిస్థానులో గిరిజన ప్రాంతాల్లో గంజాయిని వాడుకోవచ్చు. ఇండియాతో పాటు చైనా, హాంగ్ కాంగ్, ఇండోనేషియా, ఇరాక్, జపాన్, మలేషియా , రష్యా, సౌదీ అరేబియా, వియత్నాం తదితర దేశాల్లో నిషేధం ఉంది.
గంజాయి ఉత్పత్తులను ప్రజాల్లోకి తీసుకెళ్లేందుకు థాయల్యాండులో ఇలా గంజాయి ఆకులను ప్రదర్శిస్తూ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు
క్షీర సాగర మథనం సమయంలో విషాన్ని తాగిన శివుడు.. ఆ తర్వాత ఉపశమనం పొందేందుకు గంజాయిని సేవించాడని భక్తులు విశ్వసిస్తుంటారు. అందువల్లనే.. గంజాయి ఆకు కనుక ఎక్కడైనా దొరికితే దాన్ని శివుడి వద్ద పెట్టి పూజిస్తుంటారు. ఇటువంటి కారణంగానే.. నేపాల్ లో శివరాత్రి ఒక్క రోజు మాత్రం గంజాయిపై నిషేధం ఉండదు. గంజాయిలోని మత్తు శాతం చాల తక్కువగా ఉండే భాగాలతో భాంగ్ తయారికీ మన దేశంలో కొన్ని చోట్ల అనుమతి ఉంది. భాంగ్ ను పొగ పీల్చటానికి వినియోగిస్తారు. మన దేశంలో ఏ రాష్ట్రానికా రాష్ట్రం గంజాయి నిషేధ చట్టాలను అమలు చేస్తున్నాయి. వివిధ దేశాలు గంజాయిని చట్టబద్దంగా వాడుతున్నందున.. ఇది సరైన విధానం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గట్టిగా హెచ్చరించలేకపోతోంది. గంజాయి వాడకం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయని మాత్రమే చెబుతోంది.