స్వయం సహాయక సంఘాల మహిళలు ఇలా పేడను తూకం వేసి అందజేసే దృశ్యాలు ఇప్పుడు చత్తీగడ్ లోని గ్రామగ్రామాన కనిపిస్తాయి
బురుజు.కాం Buruju.com : కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే పశు పోషకుల నుంచి ఆవు పేడను కిలో రూ.2 చొప్పున కొనుగోలు చేస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాట్ ప్రస్తుతం ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇస్తున్నారు. ఆవుపేడపై సైతం హామీని ఇస్తున్నారంటే అక్కడ పశు సంపద ఎంతటి స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. ఇప్పటికే చత్తీసుగడ్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి వారి నుంచి ఆవుపేడను కొనుగోలు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సొమ్మును పంచిపెట్టే పథకాలే తప్ప ఇటువంటి హామీలంటూ కాగడా పెట్టి వెదికినా కనిపించవు. ఎందుకంటే.. పేడను కొంటామనే హామీని ఇవ్వాలంటే తొలుత పశు సంపదను పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాల్సివుంటుంది.
పేడను పొడిగా చేస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలు
ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా పశువుల పేడను, మూత్రాన్ని చత్తీసుగడ్ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. చత్తీసుగడ్ లో కాంగ్రెస్ పార్టీ 2018లో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. వినూత్నంగా ఆలోచించి ‘గోదాన్ న్యాయ్ యోజన’ ను 2020, జూలై నెలలో ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు పేడను తీసుకొస్తే.. దానిని ప్రభుత్వమే కిలో రూ. రెండు చొప్పున కొనుగోలు చేస్తోంది. ఇక్కడ మనేంద్రగడ్ కు చెందిన శ్యామకుమార్.. ఒక్కడే ఏకంగా రూ.4లక్షలు సంపాదించటంతో అతని ఉపాధిని చూసి ఒక అమ్మాయి అతన్ని మనువాడిందనే కథనం గత ఏడాది అక్కడి పత్రికల్లో వెలువడి పలువురుని ఆశ్చర్యపర్చింది.
పేడను విక్రయించేందుకు తీసుకెళ్తున్న మహిళ
ఇలా కొనుగోలు చేసిన పేడను కొంత ప్రాసెస్ ద్వారా ఎరువుగా తయారు చేసి.. 2,5, 30 కిలోల చొప్పున సంచుల్లో వేసి సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం విక్రయిస్తోంది. రైతులతో పాటు వ్యవసాయ, అటవీ, ఉద్యానవన శాఖలు ఇదే ఎరువును కొంటున్నాయి. పేడ సేకరణ , విక్రయం మంచి ఫలితాలను ఇవ్వటంతో ప్రభుత్వం తాజాగా ఆవుల మూత్రాన్ని లీటరు నాలుగు రూపాయలకు సేకరించటం మొదలు పెట్టింది. చత్తీసుగడ్ లో మంచి స్పందన లభించటంతో ఇదే విధానాన్ని రాజస్థాన్ లోను చేపట్టాలని అక్కడి ముఖ్యమంత్రి అశోక్ గహ్లాట్ నిర్ణయించి.. ఏకంగా దీన్నొక ఎన్నికల హామీగా ప్రకటించటం విశేషం.
ప్రభుత్వం 2020లో ప్రారంభించిన గోదాన్ న్యాయ్ యోజన పథకం వివరాలను తెలిపే పోస్టర్
ఆవు పేడకు ఇటీవల కాలంలో ఆదరణ బాగా పెరుగుతోంది. ఆన్ లైన్ అమ్మకపు వేదికైన అమెజాన్ లో.. ఆవు పేడ పొడితో పాటు పిడకలు, పూజలో ఉపయోగించే చిన్న సైజు బిల్లలను సైతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిలో ట్రస్టు బాస్కెట్ అనే సంస్థ.. అయిదు కిలోల ఆవు పేడ పొడిని రాయితీ పోను రూ.349గా పెట్టింది. అంటే కిలో పొడి ధర రూ.70 పడింది. హిమాలయన్ కలెక్షన్స్ అనే సంస్థ పూజకు పవిత్రమైన 200 ఆవు పేడ బిల్లల ధరను రూ.2,500గా చెప్పి.. రాతీయిపై రూ.1,190 ఇస్తామంటోంది. మరో సంస్థ.. ఆవు మూత్రాన్ని జీవామృతం పేరుతో అయిదు లీటర్ల ధరను ఏకంగా రూ.8,999గా పేర్కొని.. రూ.1,800కు ఇస్తామని ప్రకటించింది. ఇంకా అనేక సంస్థలు ఇప్పుడు ఆవు పేడతో రకరకాల వస్తువులను తయారు చేసి అమెజాన్ తదితర వాటి ద్వారా అమ్ముతున్నాయి. చత్తీసుగడ్ ప్రభుత్వం మాత్రం ఆవుపేడ పొడిని కిలో కేవలం ఎనిమిది రూపాయలకు అందజేస్తోంది.