ప్రభువు.. సింగభూపాలుడే భోగినిపై మనస్సు పడి భోగిని దండకాన్ని యవ్వన ప్రాయంలో ఉన్న పోతనతో రాయించుకొన్నట్టు చరిత్రకారులు తేల్చారు
బురుజు.కాం Buruju.com : ( హైదరాబాదుకు దాదాపు 50కి.మీ. దూరంలోని దాదాపు 700 ఏళ్ల క్రితం నాటి రాజధాని నగరమైన రాచకొండపై ప్రభుత్వం దృష్టి సారించగలిగితే అది కర్ణాటకలోని హంపి విజయనగరం అంతటి పర్యాటక ఖ్యాతిని పొందగలుతుందంటూ బురుజు.కాం అందిస్తున్న కథనాల్లో ఇది నాలుగోవది) నాటి రాచకొండ ప్రాముఖ్యతను అంచనా వేయాలంటే.. బమ్మెర పోతన రాసిన ‘భోగిని దండకాన్ని’ పరిశీలించాలి. దానిలో పొందుపర్చిన పేర్లు ఇప్పటికీ రాచకొండలో మనుగడలో ఉన్నందున దానిలోని అంశాలను చారిత్రక సత్యాలుగా పరిగణించొచ్చు. నాటి ప్రభువు వద్దకు తనను తీసుకెళ్లాలంటూ భోగిని అనే యువతి పట్టుపడుతున్నప్పుడు.. వేశ్య అయిన ఆమె తల్లి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తూ.. ‘ మన ఇంటిలోనే బోలెడు బంగారం ఉండగా రాజును వివాహమాడటం ఎందుకు’ అని అంటుంది. ఆ వేశ్యకు చెందిన నాటి అద్దాల మేడ ఆనవాళ్లు రాచకొండలో ఉండే ఉంటాయి. మేడ జాడను భూమి పొరల్లో వెదకగలిగితే.. అక్కడ బంగారం సైతం లభించొచ్చు. ఇప్పటికే రాచకొండలో గుప్త నిధుల అన్వేషకులు తవ్విన గుంతలు పలు చోట్ల కనిపిస్తున్నాయి.
రాచకొండ కొటలో ఇప్పటికీ నిలిచివున్న భోగ మండపం
రాచకొండ నగర వైభవాన్ని బమ్మెర పోతన తన భోగినీ దండకంలో కళ్లకు కట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో శిలలతో నిర్మించిన ఆలయాలు, మండపాలు తప్ప నాటి నివాసాలు ఏవీ పైకి కనిపించటం లేదు. పురావస్తు శాఖ తవ్వకాలను చేపడితే నాటి భవనాల ఆనవాళ్లు తప్పక లభిస్తాయి. పోతన.. భోగినీ దండకంలో పేర్కొన్న ‘భోగమండపం’, ‘భోగందాని గుడి’ నేటికీ వ్యవహారంలో ఉన్నాయి. ఆనాటి నగరం అత్యన్నతంగా ఉండేదని అదే భోగినీ దండకంలో వివరించి ఉన్నందున దాని ఆచూకీ కోసం ఇప్పుడు పరిశోధనలు అవసరం. రాచకొండను మూడవ సింగభూపాలడు క్రీ.శ 1425-33 మధ్య ఏలినప్పడు 1430 ప్రాంతంలో పోతన రాచకొండలోనే ఉంటూ భోగినీ దండకం రాసినట్టు చరిత్రకారులు డా.సంగనభట్ల నరసయ్య తమ ‘భోగినీ దండకము-ప్రతిపదార్ధ వ్యాఖ్యాన, చారిత్రకాంశ సహితము’ అనే గ్రంధంలో స్పష్టంచేశారు .
అసలు భోగినీ దండకంలోని విషయం ఏమిటంటే.. ఆనాడు రాచకొండలో గోపాల దేవోత్సవం పేరిట వసంతోత్సవాన్ని నిర్వహించేవారు. ఎప్పుడూ శతృ దుర్భేధ్యమైన కోటలో ఉండే ప్రభువు.. వసంతోత్సవం సమయంలో మాత్రం వీధుల్లో ఊరేగింపుగా వెళ్లేవాడు. వీధిలో నివసిస్తున్న ఒక వేశ్య కుమార్తె.. తన ఇంటి మేడ కిటికీ నుంచి రాజును చూసి మోహిస్తుంది. అప్పటి నుంచి ఆమె రాజు గురించే కలవరిస్తూ.. అతని వద్దకు తనను తీసుకెళ్లాలంటూ తల్లి, సొదరిపై వత్తడి తెస్తుంది. వేశ్య వృత్తిని వదులు కొని ఇలా కోటలోకి వెళ్లాలనుకోవటం మంచిది కాదని, అసలు కోటలోకి వెళ్లి రాజును కలవటమే చాలా కష్టమని తల్లి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. వెళ్లినా అసలు మాట్లాడటం సాధ్యంకాదని , సాధారణ వేశ్య సంతతిని ఆయన స్వీకరించరని అంటుంది. ఎంతో మంది రాచకన్యలు రాజువద్దకు వచ్చేందుకు తహతహలాడుతుంటారని, అటువంటప్పుడు రాజు దర్శనం తేలికగా ఎలా లభిస్తుందని తల్లి ప్రశ్నిస్తుంది. అయినప్పటికీ కుమార్తె అదే ధ్యాసలో ఉండటంతో చివరికి సింగభూపాలుడిని కలసి కుమార్తె గురించి తెలపగా.. ఆయన ఆ యువతిని తన అంత: పురంలోకి పిలిచి.. భోగిని అనే నాట్యకత్తె పదవిని ఇచ్చి ఎత్తైన ఏనుగు అంబారిపైకి ఎక్కేటట్టు చేస్తారు. పోతన వర్ణనలను బట్టి.. భోగినీ కథను రాజు సింగభూపాలుడే రాయించుకొన్నట్టుగా అంచనావేయొచ్చని చరిత్రకారులు అంటారు.
రాచకొండ కోటలోని ఒక ద్వారం
కోట ప్రవేశం చాలా కష్టమని బోగని తల్లి అన్నట్టుగానే ఇప్పటికీ అతి పెద్ద ద్వారాలు అక్కడ నిలిచివున్నాయి. భటులు పెద్ద సంఖ్యలో కాపలా ఉండేందుకు వీలుగా అరుగులతో గల భారీ ఏర్పాట్లు అక్కడ కనిపిస్తాయి. పోతన నగర వర్ణనను బట్టి.. ఆనాడు వేశ్యలకు గల పెద్ద భవనాల్లో జూదక్రీడలు, వీణా వాద్యాలు, కవిత్వ సాధన,నృత్యాల్లో శిక్షణలు ఉండేవి. కోటలోపల నాలుగు స్థంభాలతో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ప్రకృతిని ఆస్వాదించే విధంగా నిర్మించిన భోగ మండపం ఇప్పటికీ ఉంది. దీన్నే స్థానికులు భోగందాని మంచం అని వ్యవహరిస్తుంటారు. రాచకొండలోని ఒక ఆలయాన్ని ఇప్పటికీ భోగందాని గుడి అంటూ భోగినీ పేరుతోనే ప్రజలు పిలుస్తారు. భోగినీ పేరును శాశ్వతం చేయటం కోసంమే రాజు ఇలా దండకం రాయించటమే కాకుండా మండపం, ఆలయం నిర్మించి ఉండొచ్చు. ఇది బహుశా నర్సింహా ఆలయం కావచ్చని సంగనభట్ల అంటారు. రాచకొండను పర్యాటక ప్రాంతంగా మార్చగలిగితే ఇవన్నీ సందర్శకులకు అబ్బురపరచకమానవు. ఆనాడు గోపాలదేవ ఉత్సవం జరిగేటప్పుడే రాజు పురవీధుల్లోకి వచ్చేవారు. ప్రస్తుత అనేక శిధిల ఆలయాల్లో గోపాలదేవ ఆలయం ఎక్కడ ఉందో కనుక్కోగలిగితే పుర వీధులనూ , అక్కడ భోగినీ మేడ అచూకీని భూమి పొరల్లో వెదికి పట్టుకోవచ్చు. ప్రస్తుతం ఆలయాలు ఉన్నప్పటికీ దేనిలోను విగ్రహాలు కనిపించటంలేదు. భోగిని తల్లి ఎట్టకేలకు రాజ భవనంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ నాట్య మందిర వేదికపై మణులు పొదిగిన బంగారు శయ్యపై రాజు ప్రకాశిస్తూ కనిపిస్తాడు. బంగారు శయ్య ఎవరి పరమయ్యిందో కాని అక్కడ వేదికను మాత్రం ఇప్పటికీ చూడొచ్చు. పోతన జన్మస్థలి అయిన వరంగల్ జిల్లాలోని బమ్మెర గ్రామం అభివృద్ధిని ప్రభుత్వం చేపట్టింది. అదే పోతన.. తన యవ్వన కాలంలో నడయాడి, బోగినీ దండకం రాసిన రాచకొండపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ( అయిదో భాగం వచ్చేవారం)