అల్లూరిని కాల్చివేశామంటూనే.. ప్రజల్ని గందరగోళ పర్చారు ( ఎనిమిదో భాగం )
personBuruju Editor date_rangeFri Dec 15 2023 00:00:00 GMT+0530 (India Standard Time)
అల్లూరి సీతారామరాజును చెట్టుకు కట్టి కాల్చివేసి.. తప్పించుకొని పారిపోతుంటే కాల్చివేశామంటూ రికార్డుల్లో కట్టుకథ అల్లారు. ఆయన బతికే ఉన్నారని ప్రజలు బలంగా నమ్ముతూ రావటం వల్ల.. బ్రిటీష్ రికార్డుల్లోని కట్టుకథను ఎవరూ పట్టించుకోలేదు
బురుజు.కాం Buruju.com : ( స్వయంగా లొంగిపోయిన అల్లూరి సీతారామరాజును చెట్టుకు కట్టి హతమార్చిన నాటి బ్రిటీష్ పోలీస్ అధికారులు.. 1924 నాటి మద్రాసు ప్రెసిడెన్సీ పరిపాలన నివేదికలో.. ఆయన పారిపోతుంటే కాల్చిచంపామని పేర్కొన్నారు. ఆయన మరణ రహస్యాన్ని ఛేదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిషన్ ను ఏర్పాటు చేయాలని సూచిస్తూ.. బురుజు.కాం కొత్త విషయాలతో అందిస్తున్న కథనాల్లో ఇది ఎనిమిదోవది ) అల్లూరి సీతారామరాజును Alluri seetharama Raju ను కాల్చివేశామని ప్రకటించిన బ్రిటీష్ అధికారులు.. ఆ తర్వాత అల్లూరి బతికే ఉన్నాడనే వాదనలకు ఊతమిస్తూ ప్రజల్ని గందరగోళపర్చారు. పర్యవసానంగా.. సీతారామరాజు మళ్లీ ప్రత్యక్షమవుతాడని, ఆయన హిమాలయాలకు వెళ్లారని, బెండపూడి సాధువుగా మారిపోయారని వంటి వాదనలెన్నో అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి. పలానా వారు సీతారామరాజుగా ఉన్నారని ప్రజలు అనుకోవటమే తరవాయి.. బ్రిటీష్ గూఢచారులు ఆయా వ్యక్తుల వద్దకు వెళ్లి నువ్వెవరు? అంటూ ఆరాతీసి.. ఉన్నతాధికారులకు నివేదికలు పంపేవారు. దీంతో ప్రజల అనుమానాలు బలపడేవి. సీతారామరాజును నిర్ధాక్షణ్యంగా కాల్చివేసినప్పుడు నోరు మెదపని పత్రికలు, నాయకులు .. ఆ తర్వాత ప్రజల స్పందనకు అనుగుణంగా ప్రశ్నించటం మొదలు పెట్టటం వల్లనే బ్రిటీష్ ప్రభుత్వం ఇలా నాటకాలు ఆడినట్టు స్పష్టమవుతోంది.
అల్లూరిని మననం చేసుకొంటూ ఇలా ప్రదర్శనలు చేయటంతో సరిపెట్టకుండా ఆయన మరణ రహస్యాన్ని ప్రభుత్వం ఛేదించేలా వత్తిడి తేవాలి
రామరాజు తప్పించుకొని పారిపోతుంటే కాల్చివేశామంటూ 1924, మే 16 తేదీన బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం చెప్పినదాన్ని ప్రజలు నమ్మలేదు. అప్పట్లో రాజమండ్రీ నుంచి వెలువడిన కాంగ్రెసు పత్రికలో.. మద్దూరి అన్నపూర్ణయ్య గారు కూడా.. బ్రిటీష్ వారు వెలువరించిన మృతదేహం ఫొటో రామరాజుది కాదని, ఆయన ఎలా ఉంటారో బాల్య స్నేహితుడనైన తనకు బాగా తెలుసునని రాశారు. దీంతో అల్లూరి చనిపోలేదని, బ్రిటీష్ పోలీసుల నుంచి తప్పించుకొని ఎక్కడికో వెళ్లిపోయారని ప్రజలు బలంగా నమ్మేవారు. ఇటువంటి నేపథ్యంలో.. అల్లూరి మరణంపై కొంత ఆలస్యంగానైనా.. మహాత్మాగాంధీతో సహా కొందరు నాయకులు, పత్రికలు ప్రశ్నించటంతో బ్రిటీష్ పాలకులు ప్రజల నమ్మకాలను సజీవంగా ఉంచేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రజల విశ్వాసాలను తమకు కలసి వచ్చిన అంశాలుగా వారు పరిగణించారు. రామరాజు బతికి లేరని, ఆయన్ని తాము హతమార్చామంటూ వివరణలు ఇవ్వకుండా మౌనం వహిస్తూ వచ్చారు. దీంతో చెట్టుకు కట్టి కాల్చివేసిన ఘోరం నుంచి వారు సునాయాసంగా బయటపడగలిగారు.
సీతారామరాజు సోదరి దంతులూరి సీతమ్మ, సోదరుడు సత్యనారాయణ రాజు
ప్రజలు సీతారామరాజు బతికే ఉన్నాడని భావించి ఆయన ఆగమనం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఆయన చనిపోయిన పదేళ్ల తర్వాత కూడా.. భీమవరంలో 1934లో సీతారామరాజులా ఉన్నాడంటూ ఒక సాధువును పోలీసులు తమ వెంట తీసుకెళ్లి ఆ తర్వాత విడిచిపెట్టినట్టు కొన్ని గ్రంధాల్లో రాశారు. అప్పటికి ఆయన చనిపోయి 18 ఏళ్లు అయ్యింది. ఆయన తప్పించుకొని హిమాలయాలకు తపస్సు కోసం వెళ్లిపోయి ఉంటారని కొందరు అంచనా వేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద పాపికొండల్లో తపస్సు చేసుకొంటున్న పేరంటాలపల్లి సాధువు సీతారామరాజుగా మరి కొంత మంది వాదించారు. తుని వద్ద బెండపూడి ఆశ్రమంలో గల స్వామీజీనీ ఇలాగే అనుమానించేవారు. రామరాజు వివాహం చేసుకొని శేషజీవితాన్ని ఎక్కడో గడుపుతున్నారని సరిపెట్టుకొన్నవారూ ఉన్నారు. సీతారామరాజు బతికే ఉన్నడనే వాదనలను ఖండించే ప్రకటలేవీ ప్రభుత్వం నుంచి వెలువడకపోవటంతో కొన్ని అనుమానాలు ఇప్పటికీ అలాగే ఉండిపోయాయి. రాజమండ్రీలో 1942లో చోటు చేసుకొన్న ఒక ఉద్యమంలో.. సీతారామరాజు తప్పక ప్రత్యక్షమవుతాడని ప్రజలు ఆశగా ఎదురు చూశారు.
అల్లూరి సీతారామరాజు తల్లి సూర్యనారాయణమ్మ
బెండపూడి సాదువు చనిపోయే ముందు ఆయన డీఎన్ఏ ను తాను సేకరించానని, సీతారామరాజు ప్రస్తుత వారసు ల డీఎన్ఏతో పోలిస్తే బెండపూడి సాధువు అల్లూరి సీతారామరాజే అని నిర్దారణ అవుతుందని డాక్టరు హనుమంతు ఆనే ఆయన కొంత కాలం క్రితం మీడియా ముందుకొచ్చి హడావిడి చేశారు. ప్రభుత్వం ఒక కమిషన్ ను ఏర్పాటు చేయగలిగితే ఇటువంటి ఆంశాలు అన్నింటికి ముగింపు లభిస్తుంది. సీతారామరాజు జయంతి, వర్ధంతిల రోజుల్లో ఆయన విగ్రహాలకు పూలమాలల్ని వేసి సభలను నిర్వహించే వివిధ సంఘాల వారంతా అల్లూరి.. బ్రిటీష్ వారి అధీనం నుంచి పారిపోయేంతటి పిరికిపంద కాదని నిరూపించేందుకు నడుంకట్టాలి. అప్పుడు ఏం జరిగిందీ ఇప్పటికైనా వెల్లడయ్యే రీతిలో చర్యలు చేపట్టాల్సిందిగా ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తేవాలి ( తొమ్మిదో భాగం వచ్చేవారం )