అల్లూరి మృతిపై గాంధీ ప్రశ్నించినా.. మనం మాత్రం పట్టించుకోలేదు ( ఆరో భాగం)
personBuruju Editor date_rangeFri Dec 01 2023 00:00:00 GMT+0530 (India Standard Time)
అల్లూరి విప్లవ మార్గాన్ని మహాత్మాగాంధీ వ్యతిరేకించినప్పటికీ.. అల్లూరి మరణించిన అయిదేళ్లకు ఆయన మరణంపై తన ‘యంగ్ ఇండియా ’ పత్రికలో సందేహాలను లేవనెత్తారు
బురుజు.కాం Buruju.com; Hyderabad (అల్లూరి శ్రీరామరాజు తమ అధీనం నుంచి పారిపోతుండగా కాల్చి చంపినట్టు 1925 నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ నివేదిలో బ్రిటీష్ ప్రభుత్వం స్పష్టంగా రాసింది. ఇలా రాయటం ఆ త్యాగమూర్తిని అవమానపర్చినట్టే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిషన్ ను ఏర్పాటు చేసి నిజాలను రాబట్టాలని, బ్రిటన్ ప్రభుత్వంతో క్షమార్పణలు చెప్పించాలని సూచిస్తూ .. కొంగ్రొత్త విషయాలతో ‘ బురుజు.కాం’ అందిస్తున్న కథనాల్లో ఇది ఆరోవది ) అల్లూరి మరణంపై సందేహాలను వ్యక్తం చేస్తూ.. మహాత్మా గాంధీ అధ్వర్యంలో వెలువడిన ‘ యంగ్ ఇండియా’ పత్రిక కథనాన్ని ప్రచురించిన తర్వాతనైనా మన నేతలు బ్రిటీష్ అధికారులను గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయలేదు. అల్లూరిని దోపిడీదారుగా చిత్రీకరించిన నాటి కాంగ్రెస్ అగ్రజులు టంగుటూరి ప్రకాశం పంతులు.. తన పొరపాటుకు చింతిస్తున్నానని చెప్పిన దాఖలాలైతే ఎక్కడా లేవు. మద్దూరి అన్నపూర్ణయ్య, పట్టాభి సీతారామయ్య వంటి కొంతమంది నాయకులు పత్రికల ద్వారా బ్రిటీష్ వారిని ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పర్యవసానంగా.. సీతారామరాజు మరణం ఇప్పటికీ మిస్టరీగానే నిలిచిపోవలసి వచ్చింది.
అల్లూరి మరణాన్ని ప్రశ్నించి, ఆయనపై ప్రత్యేక సంచికను వెలువరించి జైలు పాలైన అల్లూరి బాల్య మిత్రుడు మద్దూరి అన్నపూర్ణయ్య
సీతారామరాజు మరణంపై ‘ఎంగ్ ఇండియా’ పత్రిక 1929, జూలై నెలలో ఒక కథనాన్ని ప్రచురించింది. కథనాన్ని తానే ఎడిట్ చేసి ప్రచురించినట్టు గాంధీ గారు అదే సంచికలో పేర్కొన్నారు. దానిలో ఇలా ప్రశ్నించారు.. ‘‘ సీతారామ రాజు ఏమయ్యాడు? పట్టుబడినాడా? తుపాకీ గుండుకు ఎరై చనిపోయినాడా? ప్రభుత్వం వారి ప్రకటన అస్పష్టంగాను, చికాకుగాను ఉన్నాయి. అయన చనిపోయినాడన్న విషయం ఇప్పటికీ నిగూఢంగానే ఉన్నది ’’ అంటూ ఇంకా చాలా వివరాలను పొందుపర్చారు. అప్పటికి రాజు చనిపోయి అయిదేళ్లవుతోంది. అల్లూరి సమాచారాన్ని గాంధీగారికి పంపింది అల్లూరి బాల్య మిత్రుడు, ‘కాంగ్రెస్’ పత్రిక సంపాదకుడు దువ్వూరి అన్నపూర్ణయ్యగారే. ఈ విషయాన్ని దువ్వూరి అన్నపూర్ణయ్యగారు, మహాత్మా గాంధీ ఇద్దరూ తమ పత్రికల్లో ధృవీకరించారు.
మహాత్మా గాంధీ సంపాదకత్వంలో.. యంగ్ ఇండియా పత్రిక ఇలా ఉండేది
ఎంగ్ ఇండియా పత్రికలో వ్యాసాన్ని ప్రచురించటానికి రెండు నెలల ముందు.. అల్లూరి పట్ల ప్రజలకు గల అభిమానాన్ని గాంధీగారు రాజమండ్రిలో స్వయంగా చవిచూడగలిగారు. అప్పట్లో.. అంటే 1929, మేనెలలో గాంధీగారు గోదావరి జిల్లాలో పర్యటిస్తూ రాజమండ్రీకి వచ్చారు. అప్పుడు అయనకు ప్రజలు నగదు, బంగారు ఆభరణాలను సహాయ నిరాకరణ ఉద్యమానికి విరాళాలుగా ఇవ్వటంతో పాటు కొన్ని బహుమతులనూ అందజేశారు. అటువంటి బహుమతుల్లో అల్లూరి సీతారామరాజు చిత్రపటం కూడా ఒకటి ఉంది. వస్తువులను అక్కడికక్కడే వేలం వేయగా సీతారామరాజు చిత్రపటాన్ని చెన్నా వీరరాజు అనే ఆయన అరు రూపాయలకు కొన్నారు. మహాత్మాగాంధీ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో 1929, జూలై 18వ తేదీన చిత్రపటం విషయాన్ని ప్రస్తావించి, సీతారామరాజు గురుంచి తొలుత తనకేమీ తెలియదని, తాను విచారించిన మీదట ఆయన వీరోచిత కృత్యాలకు సంబంధించిన అనేక గాథలు తనకు తెలిశాయని ప్రశంసించారు. గాంధీగారు ఎంగ్ ఇండియాలో రాయటానికి రెండేళ్ల ముందు.. అంటే 1927లో రాజమండ్రిలోని ‘కాంగ్రెస్ ’ పత్రికకు సీతారామరాజును ప్రశంసిస్తూ ఒక సందేశం సైతం పంపారు. సీతారామరాజు హింసా మార్గాన్ని తాను సమర్ధించకున్నా.. ఆయన దేశభక్తిని అభినందిస్తున్నట్టుగా ఆ సందేశంలో స్పష్టంచేశారు.
27 ఏళ్ల ప్రాయంలోనే బ్రిటీష్ వారిపై పోరాడి నేలకొరిగిన యువ కిశోరం
మన్యంలో సీతారామరాజు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సమయంలో.. 1922, ఆగస్టు 30వ తేదీన అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు టంగుటూరి ప్రకాశం పంతులు.. పెద్దాపురం కాంగెస్ సంఘానికి పంపన ఒక తంతిలో.. రాజు, అతని అనుచరులు దోపిడీకాండ్రు అని, వారు దేశభక్తులు కారని వక్కానించారు. టంగుటూరి వంటి నేతలే ఇటువంటి వ్యాక్యలు చేయటంతో కొన్ని పత్రికలు సైతం మన్యం పోరాటాన్ని చులకన చేసి రాశాయి. ఒక విధంగా అల్లూరి విప్లవాన్ని నడిపిన రెండేళ్లూ కొన్ని పత్రికలు అదేపనిగా ఆయన్ని దుయ్యపడుతూ కథనాలు వండివార్చాయి. అల్లూరి హింసా సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూనే కొంతమంది కాంగ్రెస్ పార్టీవారు ఆయన్ని పొగుడుతున్నారంటూ 1924, అక్టోబరు 24వ తేదీన ‘జ్యోతి’, ఆ మరుసటి రోజున ‘కృష్ణా’ పత్రికలు విమర్శించాయి. అంటే రాజు చనిపోయిన తర్వాత కూడా ఈ రెండు పత్రికలు దిద్దుబాటు చర్యలకు పూనుకోలోలేదు.
కొందరు పెద్దలు సరైన రీతిలో వ్యవహరించకున్నప్పటికీ.. బులుసు సాంబమూర్తి వంటి వారు మాత్రం చాలా బాధపడ్డారు. సీతారామరాజు మరణించినట్టుగా ప్రకటన వెలువడ్డ రోజున తాను తన మిత్రులు చాలా దు:ఖించామని అయ్యదేవర కాళేశ్వరరావు తన ‘‘ నా జీవిత కథ’’ లో రాశారు. నాటి కాంగ్రెస్ పెద్దలు బులుసు సాంబమూర్తితో సహా పలువురు అసలు సీతారామరాజు మరణించలేదనే నమ్మేవారని , కాని అందుకు బలమైన ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు .