మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సభలో స్థితప్రజ్ఞ తదితర నేతలు
బురుజు.కాం Buruju.com : చందాతో కూడిన నూతన పింఛను విధానాన్ని (సి.పి.ఎస్) రద్దు చేయాలనే డిమాండు.. రానున్న సాధారణ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లోను ప్రధానాంశం కాబోతోందని పాత పింఛను పథకం జాతీయ ఉద్యమ సంఘం (నేషనల్ మ్యూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం ) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. పాత పింఛను విధానం పునరుద్ధరణ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి నష్టం వాటిల్లబోదని, దానిని తిరిగి తెస్తామనే పార్టీలనే అన్ని రాష్ట్రాల్లోని ఉద్యోగులు, వారి బంధువులు రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని ఆయన పిలునిచ్చారు.
మధ్య ప్రదేశ్ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో హాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
పాత పింఛను ఇచ్చే పార్టీలకే ఓటు వేస్తామనే ఉద్యమం.. హిమాచల ప్రదేశ్ లో మొదలయ్యి.. ఇతర రాష్ట్రాలకూ వ్యాపిస్తోందని స్థితప్రజ్ఞ వెల్లడించారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో.. జనవరి 8వ తేదీన ‘ పింఛను మహాకుంభ మేళా’ పేరుతో నిర్వహించిన ఉద్యోగుల సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణ అధికారి అయిన స్థితప్రజ్ఞ.. ఓపీఎస్ పునరుద్ధరణే లక్ష్యంగా వివిధ రాష్ట్రాల్లోని సభల్లో పాల్గొంటున్నారు. ఉజ్జయిని సభకు మధ్యప్రదేశ్ నలు మూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. తెలంగాణకు చెందిన ఓపీఎస్ ఉద్యమ నేతలు కల్వల్ శ్రీకాంత్, నరేష్ గౌడ్లు, బుచ్చన్న, ఉపేందర్, నరేందరరావు, బాల స్వామి, చంద్రకాంత్, నటరాజ్, సాయి, అరవింద్, కృష్ణా రావు తదితరులు సభలో పాల్గొన్నారు.
పాత పింఛను విధానాన్ని తెస్తామని హామీ ఇచ్చే పార్టీలకే ఓటు వేస్తామంటూ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఉద్యమ నేతలు
ఇప్పటికే ఒక జాతీయ పార్టీ తాను పాలిస్తున్న రాష్ట్రాల్లో ఓపీఎస్ ను అమలు చేయటానికి ముందుకొచ్చిందని , మధ్యప్రదేశ్ తో సహా మిగతా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలూ ఇదే మాదిరిగా వ్యవహరించాలని స్థితప్రజ్ఞ కోరారు. పాత పింఛను పునరద్ధరణ వల్ల తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందంటూ ..అసలు ఆర్థిక అంశాలపై అవగాహన లేని వారితో రాష్ట్ర ప్రభుత్వాలు వివరణలు ఇప్పిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.