తెలుగు రాష్ట్రాలు 9ఏళ్లలో చెల్లించిన వడ్డీలు రూ.3లక్షల కోట్లు !
personBuruju Editor date_range2023-12-17
అప్పులను ఉచితాలకు మళ్లించకుండా.. వీరి తల్లితండ్రులకు చేతినిండా పనిదొరికేలా రహదారులు ,సాగునీటి ప్రాజెక్టులు వంటి నిర్మాణాలను చేపడుతుండాలి. విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను బాగా అందుబాటులోకి తీసుకురావాలి. అలా చేసినపప్పుడు ఇటువంటి దృశ్యాలు ఉండబోవు
బురుజు.కాం Buruju.com: Hyderabad: ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొమ్మిదేళ్ల వ్యవధిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు తమ అప్పులపై కట్టిన వడ్డీలు రూ.3 లక్షల కోట్లు. రెండు రాష్ట్రాలు బడ్జెట్లలో చెప్పకుండా దొడ్డి దారిలో అప్పులను తెస్తున్నప్పటికీ వాటిపై వడ్డీలను మాత్రం బడ్జెట్ల నుంచే చెల్లిస్తుంటాయి. అందువల్ల రాష్ట్రాల అప్పుల భారాన్ని అంచనా వేయటానికి అవి ఏటా చెల్లించే వడ్డీలూ ఒక సూచికగా ఉపయోగపడతాయి.
అప్పులతో సాగునీటి ప్రాజెక్టులు వంటి ఆస్తులను సమకూర్చుకొన్నప్పుడు వాటి ద్వారా పలువురికి ఉపాధి అవకాశాలు మెరుగయ్యి ఖజానాకు రాబడులూ పెరుగుతాయి. అప్పులను debt ఆస్తుల కోసం కాకుండా ఉచిత పథకాలకు వినియోగించినప్పుడు కొత్త ఆస్తులంటూ సమకూరవు కనుక అదనపు రాబడులూ ఉండవు. పైగా.. ఉచితాలకు వినియోగించిన అప్పలపై వడ్డీలను ప్రభుత్వాలు ఏళ్ల తరబడి చెల్లించాల్సివుంటుంది. అందువల్లనే.. అప్పులను కేవలం ఆస్తుల కల్పనకే వినియోగించాలని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. వడ్డీలకు అధిక మొత్తాలు వెళ్లినప్పుడు పెట్టుబడి వ్యయానికి నిధుల కొరత ఏర్పడుతుందని ఆయన విశ్లేషించారు.
రాబడులు తక్కువ, రోజువారి ఖర్చులు ఎక్కుగా ఉన్నప్పుడు ఆర్బీఐ వద్దకు ఓవర్ డ్రాప్టుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ప్రతినెలా చేపదుళ్లకు, ఓవరుడ్రాప్టుకు వెళ్లకతప్పటం లేదు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను అప్పుల్లో సింహ భాగాన్ని ఉచిత పథకాలకు, పాత అప్పుల చెల్లింపులకు వినియోగిస్తున్నందున ఆర్థిక పరిస్థితి గాడితప్పే పరిస్థితి తలెత్తుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2014, జూన్ నెలలో తెలంగాణ వేరు పడింది. 2014-15 నుంచి 2023-24 వరకు తొమ్మిదేళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ 1.75 లక్షల కోట్లు, తెలంగాణ 1.35 లక్షల కోట్లు వడ్డీలుగా ( 2023-24 అంచనా వడ్డీలను కలుపుకొని) చెల్లించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2013-14లో చెల్లించిన వడ్డీలు రూ.10,811 కోట్లు. రెండు రాష్ట్రాలు కలిపి ప్రస్తుత 2023-24లో చెల్లిస్తున్న వడ్డీలు ఏకంగా రూ.51,280 కోట్లు.