కలెక్టరు గుట్టు రట్టు చేసి శవమైపోయిన ఏసీబీ ఇనస్పెక్టర్ ( మొదటి భాగం)
personBuruju Editor date_range2022-07-02
ఇనస్పెక్టర్ శ్రీనివాసరావు
పిళ్లా సాయికుమార్, బురుజు.కాం Buruju.com : నీతి నిజాయితీలతో పాటు ధైర్య సాహసాలతో పనిచేసిన ఓ పోలీస్ అధికారి అనుమానాస్సద మరణం.. నిజాయితీని చిన్నబోయేటట్టు చేసింది. ఆయన మరణానికి దారితీసిన వ్యవస్థాగత లోపాలను సరిదిద్ది నిజాయితీని తిరిగి తేజోవంతం చేయాల్సిన పాలన వ్యవస్థ.. చేష్టలుడిగి చూసింది. విజయనగరంలో 35 ఏళ్ల క్రితం.. 1988లో రైలు పట్టాలపై శవంగా కనిపించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇనస్పెక్టర్ మోటూరి శ్రీనివాస రావు (44) ఒక ప్రశ్నగానే మిగిలిపోయారు. ఆయన మరణం ఇప్పటికీ ఓ మిస్టరీయే. ఆయనది హత్యా? ఆత్మహత్యా? ఆత్మహత్యే అయినట్లైతే అందుకు కారణాలు ఏమిటి? కారణాలను చెప్పకుండా పోలీస్ శాఖ ఎందుకు దాగుడు మూతలు ఆడినట్టు? వంటి వాటికి ఇప్పటికీ సమాధానాలు లేవు. ఆయన గురుంచి తెలిసినవారు మాత్రం ఆయన్ని ఇప్పటికీ గుండెల్లో పదిలపర్చుకొని సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన స్మృతులను నెమరవేసుకొంటూ ఉంటారు. అప్పట్లో విజయనగరంలో ‘ఈనాడు’ జిల్లా స్థాయి రిపోర్టరుగా పనిచేస్తూ.. నేను రాసిన పాతికపైగా కథనాలు ఆయన అనుమానాస్పద మృతిని ఆనాటి శాసన సభ వరకు వెళ్లేటట్టుగా చేయగలిగినా.. అక్కడా ఆయన మరణంపై స్పష్టత రాలేదు. ఆయన ఏజిల్లాలోనైతే పనిచేస్తున్నారో అదే జిల్లా కలెక్టర్ శర్మారావు ఇళ్లపై దాడి చేసి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ కేసు పెట్టటం, పోలీసు శాఖలోని అధికారులనూ విడిచిపెట్టకపోవటం, అక్రమాలకు పాల్పడే ఇంజినీర్లు, వైద్యులతో సహా పలువురు ప్రభుత్వ ఉద్యోగులను కంటిమీద కునుకు లేకుండా చేయటం... వంటి కారణాల వల్ల ఇనస్పెక్టర్ మరణం సహజంగానే ప్రజల్లో తీవ్ర అలజడి రేకిత్తించింది.
నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నుంచి ప్రశంసలు
ఆయన సివిల్ పోలీస్ ఎస్ఐ, సీఐలుగా పనిచేసిన శ్రీకాకుళం, గజపతినగరం, పలాస వంటి ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందగా బందును పాటించి.. అనేక మంది విజయనగరానికి వచ్చి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారంటే ఆయనంటే వారికి ఎంతటి ప్రేమానురాగాలు ఉండేవో ఇట్టే గ్రహించొచ్చు. ఉత్తమ సేవలకు గుర్తింపుగా నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు నుంచి ,ఉన్నతాధికారుల నుంచి ఆయన పలు సార్లు అవార్డులు అందుకొన్నారు. ఆయన పనిపట్ల చూపించిన అంకిత భావం, సమాచార సేకరణ విధానం, ఎవరి వద్దా చేయి చాచకపోవటం, సీఐగా ఉంటూ కూడా అతి సామాన్య జీవితాన్ని గడపటం .. ఇవన్నీ ఇప్పటి పోలీస్ సిబ్బంది తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. అంతటి నిజాయితీపరుడు మృతి చెందటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో ఇప్పటికీ అధికారికంగా వెల్లడికాకపోవటంతో ఆ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. శ్రీకాకుళం సివిల్ పోలీస్ సీఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావు 1984లో ఏసీబీ విజయనగరం రేంజికి ఇనస్పెక్టరుగా వచ్చారు. అప్పట్లో విజయనగరం రేంజిలోనే శ్రీకాకుళం ఉండేది. రేంజి కేంద్రమైన విజయనగరంలో ఇద్దరు ఇనస్పెక్టర్లతో సహా డీఎస్పీ, ఇతర సిబ్బంది ఉండేవారు. వీరి కార్యాలయం తోటపాలెంలో ఉండేది. మయూరీ జంక్షన్లోని పెట్రోల్ బంకు సమీపంలో గల నాయుడి వీధిలోని పాత ఇంటిలో శ్రీనివాసరావు అద్దెకు ఉండేవారు. విలేకర్లు అప్పడప్పుడు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ కూర్చోవటానికి కుర్చీలు సైతం ఉండేవి కావు. శ్రీనివాసరావే నాలుగో కాలు విరిగి పోయి.. మూడు కాళ్లతో కనిపించే కుర్చీలో కూర్చునేవారు. శ్రీకాకుళం జిల్లాలోని మామగారి ఇంటి నుంచి శ్రీనివాసరావు కుటుంబానికి కావాల్సిన బియ్యం తదితరాలు వస్తుండేవి.
నిజాయితీపరుడి మరణంపై దర్యాప్తు ఇలాగేనా?
ఇప్పటి మాదిరిగా అప్పట్లో అవినీతిపరుల వివరాల సేకరణకు సాంకేతిక సరంజామా అంటూ ఏమీ ఉండేదికాదు కనుక ఒకరిపై వల పన్నాలంటే చాలా కష్టపడాల్సివచ్చేది. అతి కష్టంమీద సమాచారాన్ని సేకరించినా దాన్ని పైస్థాయి అధికారులతో పంచుకొంటే అది ఎక్కడ బయటకు పొక్కిపోతుందోననే అందోళన ఉండేది. అటువంటి నేపథ్యంలో 1987లో శ్రీనివాసరావు ఏకంగా ఐఏఎస్ అయిన జిల్లా కలెక్టరు శర్మారావు ఆస్తులపై దాడులు చేసి ఆదాయానికి మించిన ఆస్తులను కనుగొన్నారు. తెలుగుదేశం పాలనలో.. అధికారపార్టీకి అనుకూలురుగా పేరుపడ్డ కలెక్టరు.. ఏసీబీ దాడి కారణంగా సస్పెండ్ కావాల్సివచ్చింది. అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఒక ఐఏఎస్ అధికారిపై దాడి చేయటం అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. శ్రీనివాసరావు మరెంతో మంది అధికారులను ఇదే విధంగా పట్టుకొని అవినీతి పరుల పాలిట సింహస్వప్నమయ్యారు. ఇటువంటి పరిస్థితిల్లో.. 1988, జూన్ 26వ తేదీన ఆయన మృతదేహం విజయనగరం పైవంతెన వద్ద రైలు పట్టాలపై కనిపించింది. అత్యంత నీతి నిజాయితీలతో వ్యవహరిస్తూ అక్రమార్కులపై పెట్టిన కేసుల కారణంగా ఆయన్ని ఎవరో హతమార్చి రైలు పట్టాలపై పడేశారని ప్రజలు భావించారు. పోలీస్ సంఘాలూ అలాగే అనుకొన్నాయి. కేసును తొలుత రైల్యే డీఎస్పీ మజ్జి రామారావు దర్యాప్తు చేశారు. ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా రికార్డుల్లో రాయాలని ఆయన భావించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం కోసం ఇలా ప్రమాదం అని రాసి దస్త్రాన్ని మూసివేస్తే నిజాలు సమాదైపోతాయి. తమకు కావాల్సినవి నిజాలే తప్ప ప్రభుత్వ సాయం కాదని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులూ స్పష్టంచేశారు.
ఇనస్పెక్టర్ మృతిపై ‘ఈనాడు’లో వరస కథనాలు వస్తుండటంతో అప్పటి సీబీసీఐడీ డీఐజీ ఎంవీ కృష్ణారావు 1988, సెప్టెంబరులో విజయనగరం వచ్చి కొద్ది రోజుల పాటు కేసును స్వయంగా దర్యాప్తు చేశారు. కేసును సీబీసీఐడీ చేపట్టినందున వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని భావించిన ప్రజలు కొద్ది రోజుల్లోనే ఉసూరుమన్నారు. మరో వైపు.. కేసు తమ వద్దనే ఉందంటూ రైల్యే డీఎస్పీ ప్రకటించారు. హత్య అనేందుకు కావాల్సిన ఆధారాలు లేక సీబీసీఐడీ ఈ కేసును పూర్తిస్థాయిలో చేపట్టలేదా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది తేలక ఆయోమయం ఏర్పడింది. ఇటువంటి సమయంలో ‘ఈనాడు’ ఒక విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇనస్పెక్టర్ శ్రీనివాసరావు అత్యంత పకడ్బందీగా రూపొందించిన ఒక రహస్య నివేదికలో.. పై స్థాయిలో కొన్ని మార్పులు చోటు చేసుకొన్నట్టు.. అలా చేసిన మార్పులు చివరికి శ్రీనివాసరావును తలవంచుకొనేలా చేసినట్టు ఆ కథనం సారాంశం. (ఇంకా ఉంది)