సముద్రంలోని కెరటాల తాకిడికి భారీ టర్బైన్లు తిరుగుతూ విద్యత్తును ఉత్పత్తి చేస్తాయి. విదేశాల్లో ఏర్పాటైన ప్లాంటు ఇది
బురుజు.కాం Buruju.com : నదీ జలాల నుంచే కాకుండా సముద్రం నుంచీ కొద్దిపాటి దేశాలు ఇప్పటికే విద్యత్తును ఉత్పత్తి చేస్తుండగా.. మరికొన్ని దేశాలూ అటువంటి బాట పట్టే యోచనలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాలు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నట్టు చెన్నైలోని భారత సాంకేతిక సంస్థ.. మరికొన్ని సంస్థల తోడ్పాటుతో అంచనా వేసింది. వివిధ దేశాల అనుభవాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం కనుక ప్రయోగాత్మకంగా ప్రాజెక్టును చేపడితే భవిష్యత్తులో విద్యుత్ సమస్యలకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది.
గాలులకు అలలు ఏర్పడి.. వాటి వల్ల ఇటువంటి యంత్రాలు మునిగి తేలుతూ..విద్యత్తును సృష్టిస్తాయి
సముద్ర కెరటాలు, అలల నుంచి విద్యుత్ ఉత్పత్తికి చాలా కాలంగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దక్షణ కొరియా 254 , ఫ్రాన్సు 240 మెగావాట్ల సముద్ర ప్లాంటులను ఇప్పటికే కలిగి ఉన్నాయి. ఇంకా నార్త్ అమెరికా, రష్యా వంటి కొన్ని దేశాలూ చిన్న తరహా ప్లాంటులను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసుకొన్నాయి. సముద్ర కెరటాలు ఎగసిపడినప్పుడు టర్బైన్లు.. గాలి మరల మాదిరిగా నిముషానికి 12 నుంచి 18 సార్లు తిరిగి విద్యుత్ ఉత్పత్తికి సహకరిస్తాయి. దీన్ని కెరటాల విద్యుత్తుగా వ్యవహరిస్తారు. గాలులకు సముద్రంలో ఏర్పడే అలల ద్వారాను విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. సముద్రంపైన ఏర్పాటు చేసే యంత్రాలు.. అలల తాకిడికి మునిగి తేలుతూ విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దేశంలో ఆంధ్రప్రదేశ్ తోపాటు కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాలు కెరటాల ద్వారా 12,255 మెగావాట్లు, అలల ద్వారా 41,300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నట్టు అధ్యయన నివేదిక చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 100 మెగావాట్ల కెరటాల విద్యుత్తును, 6,900 మెగావాట్ల అలల విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చని అంచనా.
అలల విద్యుత్తు ఉత్పత్తి విధానం
ఉప్పు నీటిని తట్టుకొనే రాగి, స్టైన్ లెస్ స్టీలు, టైటానియం వంటి లోహాలతో తయారు చేసిన యంత్ర పరికరాలను మాత్రమే వాడాల్సివున్నందున ఖర్చు అధికంగానే ఉంటుంది. ఇంతకు ముదు.. గుజరాత్, పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వాలు ఇటువంటి ప్లాంట్ల ఏర్పాటుకు కొంత ప్రయత్నించి ఖర్చు అంచనాల తర్వాత వెనకడుగు వేశాయి. కేంద్రం పశ్చిమ బెంగాళ్ కు చాలా కాలం క్రితమే 3.75 మెగావాట్ల ప్రాజెక్టును మంజూరు చేయగా అప్పట్లోనే రూ.238 కోట్లు భరించలేమంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దీనిని నిలిపివేసింది. దీని తర్వాత 2011లో గుజరాత్ ప్రభుత్వం 50 మెగావాట్ల ప్రాజెక్టుకు ప్రయత్నాలు మొదలు పెట్టినా.. ఖర్చు రూ.750 కోట్లకు చేరుకొంటుందనే అంచనాలు రావటంతో ప్రయత్నాలను విరమించుకొంది. సముద్రం నుంచి తక్కువ ఖర్చుతో విద్యుత్తును సృష్టించుకొనే మార్గాలను కొన్ని దేశాలు అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సముద్ర విద్యుత్ కోసం ప్రయత్నాలను మొదలు పెట్టాలి.